తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది. కేడర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఆ సమయంలో సహజంగానే టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి! అదంతా ఎన్నికలకే పరిమితం అని అంతా అనుకున్నారు. కానీ, కేసీఆర్ ‘రిటర్న్ గిఫ్ట్’ ప్రకటన చేశారు. బరాబర్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామన్నారు. వైసీపీకి బహిరంగ మద్దతు ఇవ్వడంద్వారా చంద్రబాబును దెబ్బతీయడమే ఈ ‘రిటర్న్ గిఫ్ట్’ అని అంతా భావించారు. కానీ... సీమాంధ్ర నేతలు, పారిశామ్రిక వేత్తలు, సినీ ప్రముఖుల ఆస్తులను అస్త్రంగా చేసుకుని తెరవెనుక తతంగం నడిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘‘చంద్రబాబు ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ రోజైనా మళ్లీ తెలంగాణలో రాజకీయం చేయగలరు! ఆ అవకాశాలు తగ్గించాలి.
జగన్ ఆస్తులూ, కేసులూ అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. ఆయన టీఆర్‌ఎస్ చేతి నుంచి జారిపోలేరు. ఏపీలో మనం చెప్పినట్లు వినే ప్రభుత్వం ఉంటే... తెలంగాణలోనూ రాజకీయంగా వెలిగిపోవచ్చు. ఇదే టీఆర్‌ఎస్ వ్యూహం. అందుకే... వైసీపీకి అన్ని రకాలుగా సహకరిస్తోంది. ఈ వ్యూహంలో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తే... సీమాంధ్ర భవిష్యత్తుకే ముప్పు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు మరింత అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. స్వరాష్ట్రంలో బలమైన ప్రభుత్వముంటేనే సీమాంధ్రులు ఎక్కడున్నప్పటికీ ఆత్మగౌరవం నిలుస్తుంది’ అని టీడీపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు తమ రాజకీయ ఆసక్తుల మేరకు పార్టీలకు విరాళాలిస్తుంటారు. ఎందుకైనా మంచిదని రెండు ప్రధాన పార్టీలకూ నిధి సమకూర్చే వారూ ఉంటారు. అయితే... ఈసారి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ పెద్దలు కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. ‘టీడీపీకి ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికల విరాళాలు ఇవ్వొద్దు. ఆర్థికంగా వైసీపీకి మాత్రమే సహకరించండి’ అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ పరిశ్రమలు, ఆస్తులు, వ్యాపారాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉండటంతో కిమ్మనకుండా ‘తల ఊపి’ వచ్చేశారు.
సినిమా వాళ్లకూ, తెలుగుదేశానికీ మధ్య బలమైన బంధం ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించిన పార్టీ కావడం, మొదటి నుంచీ సినిమా వాళ్లకూ అవకాశాలు ఇవ్వడం దీనికి కారణం. సినీ పరిశ్రమ ఎన్టీఆర్ హయాంలోనే హైదరాబాద్‌కు వచ్చింది. సినీ ప్రముఖుల్లో అత్యధికులు సీమాంధ్రులే! ఇప్పుడు వారిపైనా రాజకీయ పడగ కదలాడుతోంది. ‘సినీ పరిశ్రమకు చెందిన వారు వైసీపీ వెంట ఉన్నారు’ అనే సంకేతాలు పంపేందు కు రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. తనమానాన తాను సినిమాలు, సంబంధిత వ్యవహారాలు చూసుకుంటున్న ఒక సినీ ప్రముఖుడిని... ‘ఒకసారి లోట్‌సపాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసి రండి’ అని తెలంగాణ నాయకుడొకరు ఆదేశించారు. ఎన్నడూ లేని విధంగా సినీ రంగానికి చెందిన చిన్నా పెద్దా నటులు, ప్రముఖులు వరుసగా వైసీపీలో చేరుతుండటం గమనార్హం!