ఏపీ-తెలంగాణ మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడులు చేస్తున్నారు. టీడీపీ వివరాలున్న సర్వర్లను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. మొత్తం 200 మంది ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చేరుకున్నారు. ఏపీలోని లబ్ధిదారుల డాటా మొత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
శనివారం అర్ధరాత్రి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సాఫ్ట్‌వేర్ కంపెనీ వద్ద ఆంధ్రా, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీకి చెందిన సేవామిత్రలు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తల సభ్యత్వ వివరాలు ఉన్న సర్వర్లను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. శనివారం సాయంత్రం నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే తెలంగాణ పోలీసులు ఉన్నారు. తమను లోపలికి అనుమతించాలని ఏపీ పోలీసులు పట్టుబట్టారు. సర్వర్లను, ఉద్యోగులను తీసుకెళ్లడానికి వీలులేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు వచ్చారని ఏపీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ డేటాతో వైసీపీ నేతలకు పనేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగులను ఇబ్బందిపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం గట్టిగా హెచ్చరించారు. మరోవైపు టీడీపీ నేతలు ఆంధ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే.. అర్ధరాత్రి ఈ ఇష్యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదని సదరు కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కర్ కోసం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చారు. అప్పటికే తెలంగాణా పోలీసులు ఆ కంపెనీలో ఇంకా సోదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆంధ్రా పోలీసులని లోపలకి పంపించలేదు. ఇక్కడ ఉద్యోగి మిస్ అయ్యారని కేసు పెట్టారని, ఆయన ఆచూకి తెలుసుకోవటానికి వచ్చామని చెప్పటంతో, ఇక తెలంగాణా పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలిపారు. భాస్కర్‌ను తమకు అప్పచెప్పాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు.