ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూకట్‌పల్లి వైసీపీ నేతలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యం కేసుపై చంద్రబాబు.. ఏపీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఏపీ ప్రజల డేటా చౌర్యం జరిగిందంటూ వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీ పై గత మూడు రోజులుగా దాడులు చేస్తున్నారు. చివరకు ఈ కేసు హైకోర్ట్ కు చేరటంతో, నిర్బంధించిన నలుగురుని తెలంగాణా పోలీసులు విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.
కాగా, ఏపీ ప్రభుత్వ డేటా ప్రైవసీపై కేసీఆర్ సర్కార్ తీరు తాతకు దగ్గులు నేర్పిస్తున్నట్టు ఉందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన ప్రభుత్వ డేటా ప్రైవసీని వాళ్లు కాపాడతారా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వానికి డేటా ఉందని... తాను కాపాడుకోగలనని అన్నారు. సీక్రెసీ మెయింటెన్ చేయగలనన్నారు. జిల్లాలోని మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవడో దానయ్య పిర్యాదు చేస్తే.. మాపై యాక్షన్ తీసుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. ఏపీకి సంబంధించిన అంశంపై యాక్షన్ తీసుకునే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. జగన్, కేసీఆర్‌తో కుమ్మక్కై ఇద్దరూ కలిసి లాలూచీ పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మీ మూలాలు కదిలిపోతాయని, ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదన్నారు. డేటా అనేది ఏపీ సొంతమని, దీనిపై తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఏపీ డేటాను ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్‌లో ఉండే పోలీసులు కాపాడతారంట? ఏపీ చెందిన డాటా ఉందని చెబుతున్నారని.. దాన్ని తమ వద్దకు పంపిస్తే తాము చూసుకుంటామని అన్నారు. దర్యాప్తు చేయడానికి తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. అమెరికాలో డేటా ఉంటే ఎవరో పనిచేస్తున్నారని ఇక్కడ కంపెనీలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. "చట్టపరంగా వెళతా.. వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే.. దాడులు జరుపుతారా? నియంత ప్రవర్తన నా దగ్గర సాగదు. మాదొక రాష్ట్రం.. మీదొక రాష్ట్రం. మాకు అన్యాయం జరిగింది. తెలుగు వాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. ఎక్కడ ఉన్నా పోరాడి రక్షించే బాధ్యత నేను తీసుకుంటా.. పనికి మాలిన రాజకీయాలు వదిలిపెట్టండి’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.