నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రత్యెక ప్రాచుర్యం కల్పించేందుకు సీఆర్డీఏ శ్రద్ధ చూపిస్తుంది. ఇందులో భాగంగా జాతీయ రహదారిలోని కనకదుర్గ వంతెన పై రాజధానికి ముఖద్వారం వంటి తాడేపల్లి సమీపంలో పెద్ద ఫౌంటైన్ ఏర్పాటు చేసింది. దీనికి రెండు వైపులా 'ఐ లవ్ అమరావతి' అని ఇంగ్లీష్ లో ఉంటుంది. నియాన్ లైట్లతో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సిఆర్డీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ లాన్, 8 భారీ ఫౌంటైన్లను ఏర్పాటు చేసారు. ఇవి వివిధ ఆకారాలతో ఎనిమిది రంగులు మార్చుకుంటూ నీటిని విరజిమ్మే తీరుని ఆకట్టుకుంటుంది. దీనిని త్వరలో సియం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
అంతే కాదు అమరావతిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ, అనేక ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆతిథ్య, పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టులు ఎక్కువగా ఈ రహదారి పక్కనే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెంకటపాలెం నుంచి కొండమరాజుపాలెం మధ్య ఈ రహదారి పక్కన ప్రస్తుతం ఎక్కువ గిరాకీ ఉంది. ఈ రహదారికి పక్కనే అమరావతి మెరీనా, మూడు నక్షత్రాల రిసార్ట్, రెండు 5 నక్షత్రాల హోటళ్లు, రెండు 4 నక్షత్రాల హోటళ్లు, ఒక సమావేశమందిరం, ఒక షాపింగ్ మాల్, హ్యూమన్ ఫ్యూచర్ పెవిలియన్, ఐటీ టవర్, మైస్ సెంటర్, కార్పొరేట్ స్ట్రీట్ వంటివి ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలు. వీటిలో చాలా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ ఇప్పటికే స్థలాలు కేటాయించింది. సీడ్ యాక్సెస్‌రోడ్డు తొలి దశలో ఉండవల్లి నుంచి అబ్బరాజుపాలెం వరకు 18.27 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.
అమరావతి మెరీనా: వెంకటపాలెం సమీపంలో 8.3 ఎకరాల్లో వస్తుంది. ఇది పర్యాటక ప్రాజెక్టు. చిన్న చిన్న బోట్లు నిలిపే స్థలాన్నే మెరీనాగా వ్యవహరిస్తారు. కృష్ణా తీరంలో వచ్చే ఈ ప్రాజెక్టు టెండరు దశలో ఉంది. వెంకటపాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్, ఒక 4నక్షత్రాల హోటల్, కొండమరాజు పాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్, ఒక 4నక్షత్రాల హోటల్ నిర్మాణానికి రెండు ప్రముఖ సంస్థలకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. ఉండవల్లి నుంచి వెళ్లేటప్పుడు రహదారికి ఎడమ పక్కన ఇవి వస్తాయి. 3.5 ఎకరాల్లో కనీసం 50 గదులతో రిసార్టు నిర్మిస్తారు. రహదారికి కుడిపక్కన వస్తుంది. కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో 1.5 ఎకరాలు, ప్రధాన అనుసంధాన రహదారికి, కరకట్టకు మధ్యలో 2 ఎకరాలు కేటాయించారు. వెంకటపాలెం దగ్గర్లోనే ఇది వస్తుంది. వెంకటపాలెం, మందడం గ్రామాల మధ్యలో 10 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఐటీ టవర్ నిర్మిస్తారు. డిజైన్లు రూపొందించే దశలో ప్రాజెక్టు ఉంది.