ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత, అమరావతిని రాజధానిగా చేసుకుని, ముందుకు వెళ్లాం. చంద్రబాబు నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా, అమరావతిని నెంబర్ వన్ సిటీగా చెయ్యటానికి ప్రణాలికలు సిద్ధం చేసారు. పనులు కూడా మొదలు పెట్టరు. అయితే, అమరావతిలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం కోసం, ప్రజలందరికీ అమరావతి మాది అనే విధంగా, అనేక కార్యక్రమాలు చేసారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, మట్టి, నీరు తీసుకోవచ్చి, అమరావతిలో పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే, అమరావతి కోసం, 10 రూపాయలకు ఇటుకు పెట్టి, అమరావతిలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలని, ప్రజలు భావించేలా చేసారు. అలాగే, అమరావతిని నెంబర్ వన్ సిటీ చెయ్యటానికి, మా రాజధాని హైదరాబాద్ కాదు, అమరావతి అని చెప్పటానికి, అమరావతి బ్రాండింగ్ కోసం, అనేక ప్రయత్నాలు చేసారు. ఇందులో భాగంగానే, ఢిల్లీలో ఉన్న ఆంధ్రాభవన్ లో, ఐ లవ్ అమరావతి అంటూ, ఒక బోర్డు పెట్టారు.
ఆంధ్రా భవన్ కు వచ్చిన ప్రతి సారి, అందరూ ఈ బోర్డు దగ్గర ఫోటోలు తీసుకుంటూ ఉండేవారు. బయట రాష్ట్రాల వారు కూడా, అమరావతి పై అవగాహన వస్తూ ఉండేది. అయితే, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఆంధ్రా భవన్ లో, ఐ లవ్ అమరావతి అనే బోర్డు మాయం అయ్యింది. ఆదివారం రోజున, ఏపి భవన్ అధికారులు, ఈ బోర్డు ని తొలగించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, ఇచ్చిన ఆదేశాల మేరకే, ఈ బోర్డు తొలగించారని సమాచారం వస్తుంది. పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే, అమరావతి అనే మాట ఎక్కడా లేకుండా, తీస్తున్నారని, చెప్తున్నారు. అయితే, ఈ బోర్డు ఎందుకు తొలగించారు అని మీడియా, ప్రతినిధులు, అక్కడ ఆంధ్రా భవన్ లో ఉన్న అధికారులని ప్రశ్నించగా, వారి నుంచి వింత సమాధానం వచ్చింది.
కోతుల బెడత ఎక్కువగా ఉందని, కోతులు ఈ బోర్డు ని నాశనం చేస్తున్నాయని, అందుకే తొలగించామని, అధికారులు చెప్తున్నారు. కోతుల వల్ల, బోర్డు తొలగించటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. కోతులకు, ఈ బోర్డు కు సంబంధం ఏమిటని అడుగుతున్నారు. అమరావతి అనే పేరు ఇష్టం లేక, ఇలా చేస్తున్నారని, పలువురు మండి పడుతున్నారు. అమరావతి అనే పదం వింటేనే, అసహనంతో ఊగిపోతున్నారని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలా చెయ్యటం తగదని వాపోతున్నారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అమరావతి పేరుతొ, ప్రభుత్వం అత్యాధునిక ఆర్టీసీ బస్సులు కూడా తిప్పుతుందని, రేపు వాటి పేరు కూడా మార్చేస్తారేమో అని వాపోతున్నారు.