ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పేర్లు ఎలా ప్రజల నోట్లో నానుతూ ఉంటాయో, అలాగే కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా నానుతూ ఉంటాయి. అవి వాళ్ళు చేసే పనులు బట్టి, ప్రజలు వారిని గుర్తిస్తూ ఉంటారు. అది మంచి అయినా, చెడు అయినా. ఈ కోవలోనే, రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా, అధికారులని అడ్డు పెట్టుకుని, అడ్డగోలుగా దోచేశారు అంటూ, సిబిఐ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి చనిపోవటంతో, ఆ కేసుల్లో ప్రధముడిగా జగన్ ఉన్నారు. అయితే ఇవన్నీ విచారణ దశలో ఉన్నాయి. ఇవి పక్కన పడితే, ఆ సమయంలో అనేక మంది అధికారులు కూడా జైలుకు వెళ్ళారు. దాదపుగా ఒక 10 మంది పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాత్రం, ప్రజలకు గుర్తుండి పోయింది. ఆమె నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ కావటం, చిన్న వయసులోనే ఐఏఎస్ అవ్వటం, తరువాత వివిధ కారణాలతో జైలు పాలు అవ్వటం, ఆ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యి, నడవలేని పరిస్థితిలో ఉన్న ఫోటోలు బయటకు రావటం, ఇవన్నీ ప్రజలు చూసారు. ఒక మంచి స్థానంలో ఉండాల్సిన ఐఏఎస్ ఆఫీసర్, ఇలా అయ్యారని, బాధ పడ్డారు. అయితే అదంతా గతం, ఇప్పుడు తాజాగా ఆమె ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమె తెలంగాణా రాష్ట్రానికి ఐఏఎస్ గా కేటాయించబడ్డారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, తనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని, తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేయాలని అనుకుంటున్నా అంటూ క్యాట్ లో దాఖలు చేసారు.
గత 5 ఏళ్ళ చంద్రబాబు హయాంలో ఆమె తెలంగాణా నుంచి పని చేయటానికి ఇష్ట పడ్డారు కానీ, ఇప్పుడు మాత్రం తాను ఏపి అని, అందుకే ఏపి వెళ్ళిపోతానని కోరారు. అయితే ఈ విషయం కేంద్రం కోర్టులోకి వెళ్ళింది. దాదాపుగా ఏడాదికి పైగా ఈ అంశం నలుగుతుంది. కేంద్రం అప్పట్లో ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, ఆయన పక్కన శ్రీలక్ష్మి కూడా కనిపించారు. పలు సందర్భాల్లో విజయసాయి, ఆమెను కేంద్రం హోం మంత్రి అమిత్ షా వద్దకు తీసుకువెళ్ళి, ఆమెను ఏపి క్యాడర్ కు ఇవ్వమని కోరారు. తెలంగాణా సియం కేసీఆర్ కూడా ఆమెను రిలీవ్ చేయటానికి ఒప్పుకున్నా, కేంద్రం ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమెకు పర్మిషన్ వచ్చింది. నిన్నటితో తెలంగాణా నుంచి రిలీవ్ అయిపోయి, ఏపిలో చేరిపోయారు. ఆమె ప్రస్తుతం జిఏడిలో రిపోర్ట్ అయ్యారు. మొత్తానికి ఆమె జగన్ నాయకత్వంలో పని చేయాలనే కోరిక తీరింది. జగన్ చేసిన లాబీయింగ్ పని చేసింది. ఆమెకు వచ్చే వారం పోస్టింగ్ ఇస్తారని, ఆమెను సిఎంఓలోకి తీసుకుని, మంచి పోస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. శ్రీలక్ష్మి ఇప్పటికే, సిబిఐ కోర్టులో తన పై వేసిన అభియోగాలు కొట్టేయాలని పిటీషన్ కూడా వేసారు.