ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కి తాము వెళ్ల‌డంలేద‌ని ఇటీవ‌ల త‌న క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో వెల్ల‌డించాడు. అయితే ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు మాత్రం అంద‌రూ పార్టీ అప్ప‌గించిన కార్య‌క్ర‌మాలు ఆగ‌స్టు నాటికి పూర్తి చేయాల‌ని టార్గెట్ పెట్టాడు. ఇక్క‌డే ముంద‌స్తు ముచ్చ‌ట దాగి ఉంద‌ని వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. అధికార పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కి వెళ్తుంది అనే దానికి మ‌రో సంకేతం భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బ‌దిలీలు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ఉత్త‌ర్వులు విడుద‌ల చేశారు. 57 మంది ఐఏఎస్‍లకు బదిలీలు, పోస్టింగ్‍లు ఇచ్చిన ప్రభుత్వం కీల‌క స్థానాల్లో త‌మ విధేయుల‌ని మొహ‌రించింది. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ ల బ‌దిలీలు అయిన వెంట‌నే ఐపీఎస్ అధికారుల స్థానాల మార్పులు చేర్పుల‌తో జీవో ఇచ్చారు. మొత్తం 39 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం త‌మ‌కి అనుకూలంగా ఉండే అధికారుల‌ని కీ పోస్టులు క‌ట్ట‌బెట్టింది. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇబ్బందిగా త‌యార‌వుతున్నార‌నే అనుమానం ఉన్న ఐపీఎస్‌ల‌ను నాన్ ఫోక‌ల్ పోస్టుల్లో ప‌డేసింది. ఎమ్మెల్యేల‌ను బ‌తిమలాడ‌టం, త‌ర‌చూ స‌మావేశాలు పెట్ట‌డం, ఆగ‌స్టు నాటికే పార్టీ వ్యూహాత్మ‌క కార్య‌క్ర‌మాలు పూర్తి కావాల‌నే టార్గెట్ ఇవ్వ‌డం, తాజాగా ఐఏఎస్-ఐపీఎస్ బ‌దిలీల‌తో ఇవ‌న్నీ ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహాలేనంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read