అధికారంలోకి వచ్చిన తరువాత, రోజు రోజుకీ వైసీపీ నేతల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఒక పక్క రాజకీయ దాడులు, హత్యలు, బెదిరింపులు, ఇలా ఒక్కటేమిటి, వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. ఈ రోజు ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బూతు పురాణం విన్నాం. ఏకంగా జర్నలిస్ట్ లనే, నడి రోడ్డు మీద నరికేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులు ఒక పక్క జరుగుతుంటే, దందాలకు కూడా అడ్డు లేకుండా పోతుంది. మొన్నటి వరకు నిర్వహిస్తున్న క్వారీలు కూడా బెదిరించి లాక్కుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చింది మాకు ఇచ్చేసి వెళ్ళిపొండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎవరైనా అడ్డు చెప్తే, తమదైన శైలి రుచి చూపించి మరీ లొంగదీసుకుంటున్నారు. తాజాగా ఈ రోజు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఇదే రకమైన దందా చేసారు వైసీపీ నాయకులు. ఇబ్రహింపట్నం క్వారీల వద్ద ఈ రోజు స్థానికంగా ఉండే వైసీపీ నేతలు హల్చల్ చేసి, అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసారు.
అందిన వివరాలు ప్రకరం, ఇబ్రహీంపట్నంలో చాలా కాలంగా క్వారీ పనులు జరుగుతున్నాయి. వీటి పై ఎప్పటి నుంచో స్థానిక వైసీపీ నేతలు కన్ను వేసారు. ప్రభుత్వం మారటంతో, అక్రమ క్వారీ అని, ఆపేయాలని కొద్ది రోజులుగా వేదిస్తున్నారు. అంతా సక్రమంగానే చేస్తున్నాం అని, క్వారీ పనులు ఆపకపోవడంతో అక్కడ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మాటే వినరా అంటూ, క్వారీ గేటు దగ్గర పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టి క్వారీల నుంచి లారీలు, రాకపోకలు సాగించకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ ఆధిపత్యం తట్టుకోలేక, వారితో తలపడలేక క్వారీ యజమానులు చేసేదిలేక పనులను ఆపేశారు. బండరాళ్లను ఎందుకు అడ్డు పెడుతున్నారు అని వైసీపీ నేతలను ప్రశ్నించగా, వచ్చి ఎమ్మెల్యేనుకలవాలని చెప్పారని క్వారీ యజమానులు అంటున్నార. అయితే ఈ ఘటన పై మరో కొత్త వాదన కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో క్వారీ యజమానులు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని, అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.