రాజధాని అమరావతిలో మరో భారీ సదస్సు జరగనుంది. గుంటూరులోని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే భారత ఆర్థిక సంఘం (ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్) శతాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐఈఏ సమావేశాలను ప్రారంభిస్తారు. బుధవారం నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు ఉద్దండులైన ఆర్థికవేత్తలంతా హాజరు కానున్నారు. 99వ వార్షిక సదస్సు కూడా గత ఏడాది తిరుపతిలోనే జరిగింది. ఒకే రాష్ట్రంలో వరుసగా రెండోసారి ఈ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి.
ఉమ్మడి రాష్ట్రంలో 1981లో తిరుపతిలో, 1991లో అనంతపురంలో ఈ సదస్సు జరిగింది. గత ఏడాది తిరుపతిలో జరగ్గా.. మళ్లీ ఇప్పుడు అమరావతిలో జరగనుంది. ఈ సదస్సులో దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక స్థితిగతులపై చర్చ జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్ర పరిస్థితిపై ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. నూతన రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగం నుంచి మౌలిక సదుపాయాల వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, జరగాల్సిందేంటి? ఏ మార్గంలో వెళ్లాలన్న దానిపై చర్చించేందుకు ఈ సదస్సులో ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు.
తొలిసారి రాజధాని ప్రాంతానికి రాష్ట్రపతి హాజరవుతున్న నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా గూఢాచారి వ్యవస్థను, బాంబ్ నిర్వీర్య బృందాలను, సాయుధ బలగాలను, క్విక్ రియాక్షన్ టీమ్‌లను, బాంబ్ డిటెక్టివ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఇందుకుగాను ముగ్గురు అదనపు ఎస్పీలు, 9మంది డీఎస్పీలు, 32 మంది సీఐ/ఆర్‌ఐలను, 68 మంది ఎస్సైలు, 63మంది ఏఎస్సై/హెచ్‌సీలు, 492 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 19 మంది మహిళా కానిస్టేబుళ్లను, 130 మందితో ఆర్ముడ్ ఫోర్స్‌ను, రెండు గ్రేహౌండ్స్ బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రపతి పాల్గొనే ప్రాంతాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.