క-రో-నా , జీవితాలను తారు మారు చేసి పడేసింది. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఈ భూలోకంలో ఉన్న సమస్త మానవాళి స్తంభించి పోయింది. ఆరోగ్యాలు పోవటమే కాదు, ప్రాణాలు కూడా పోయాయి. ఇక వ్యాపారాలు, ఉద్యోగులు, చదువులు అన్నీ నాశనం అయిపోయాయి. గత నెల రోజులు నుంచి, ఇప్పుడిప్పుడే వీటి నుంచి కోలుకుని బయటకు వస్తున్నారు. నెమ్మదిగా వ్యాపారాలు, ఆఫీస్ లు, స్కూల్స్, కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. నెమ్మదిగా ఎవరి పనుల్లో వాళ్ళు పడుతున్నారు. ప్రపంచం మొత్తం, ఇలాగే కోలుకుంటుంది. అయితే గత రెండు రోజులు నుంచి ఒక కొత్త రకం క-రో-నా వైరస్ వార్తలు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇది బ్రిటన్ నుంచి వచ్చే వాళ్ళలో ఎక్కువగా గమనిస్తున్నారు. ఇది మరింత బలంగా ఉందని అంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. ఆందోళన చెందిన పలు దేశాలు వెంటనే విరుగుడు చర్యలు మొదలు పెట్టాయి. నిన్నే పలు యూరప్ దేశాలు, బ్రిటన్ నుంచే విమానాల పై నిషేధం విధించాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మినీ, బెల్జియం సహా పలు దేశాలు, బ్రిటన్ నుంచి వచ్చే ఎయిర్ ట్రాఫిక్ నిలిపి వేస్తున్నట్టు చెప్పాయి. అలాగే అటు వైపు ఉన్న సౌదీ, ఇజ్రాయల్, టర్కీ కూడా,బ్రిటన్ నుంచి వచ్చే విమానాల పై తాత్కాలికంగా బ్యాన్ విధిస్తున్నామని చెప్పాయి.
అయితే ఈ కొత్త రకం వైరస్ బ్రిటన్ లోనే కాదని, ఆస్ట్రేలియా, డెన్మార్క్ లో కూడా గుర్తించినట్టు చెప్తున్నారు. దీంతో మిగతా దేశాలు కూడా, ముందుగా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసే పనిలో ఉన్నారు. అయితే మన భారత దేశం కూడా ఈ వైరస్ పై సమీక్ష జరిపింది. ఈ వైరస్ పై అలెర్ట్ అయిన కేంద్రం, బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను, ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన విడుదల చేసింది. రేపు అర్ధరాత్రి నుంచి బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమానాలు రద్దు అవుతాయని తెలిపింది. బ్రిటన్ లో కొత్త రకం స్ట్రెయిన్ అత్యంత పవర్ ఫుల్ అని తేలటంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆరోగ్య మంత్రి, పరిస్థితి చేయి దాటి పోయిందని ప్రకటించారు. దీంతో అన్ని దేశాలు అలెర్ట్ అయ్యాయి.