నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన కొనసాగుతూ ఉంది. బూసన్‌లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ‘డైనమిక్ లీడర్’ అని ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి లాంటి అనేక అంశాలలో పరస్పర సహకారం ఆవశ్యకతను వివరించారు.
అలాగే, దక్షిణ కొరియాలో భారత రాయబారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణకొరియాలోని క్రియాశీల నగరమైన బూసన్‌ను సందర్శించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. క్రియాశీలత, సాంకేతికత, బాహ్య ప్రపంచంతో సంబంధాలు, ఓడరేవుల అభివృద్ధి తదితర అంశాలలో బూసన్ సిటీకి, ఏపీకి సారూప్యత ఉన్నదని వివరించారు. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని కొరియన్ పారిశ్రామికవేత్తలకు దక్షిణ కొరియాలో భారత రాయబారి స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత బాగా పని చేస్తుందో ఒక ఉదాహరణ చెప్పారు... ‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలలోనే ఆ పని పూర్తిచేయడ విశేషమని, ఆయన క్రియాశీలతకు, వేగవంతమైన పనివిధానానికి ఇదే నిదర్శనమని ప్రశంసించారు. ఇక్కడ నుంచి మెషినరీ తీసుకువెళ్ళినా, మనకు సంవత్సరం పడుతుంది అని కియా ఇంజనీర్లు కూడా చెప్పారు అని, కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మూడు నెలల్లో పూర్తి చేసి ఆశ్చర్య పరిచింది అని అన్నారు... అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమని సలహా ఇస్తున్నట్టు చెప్పారు...