విజయవాడ, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, ఇండిగో ఎయిర్‌లైన్స్, దేశ రాజధాని ఢిల్లీకి, కొత్తగా సర్వీస్ నడపటానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1 వ తారీఖు నుంచి, విజయవాడ - ఢిల్లీ ఫ్లైట్ ను, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో, తొలి విమాన సర్వీసును నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. దేశ రాజధాని ఢిల్లీకి టికెట్ ధర రూ.3,330గా నిర్ణయించింది. తమ వెబ్‌సైట్‌లో ముందుగా బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన ఇండిగో సంస్థ, ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ఆఫర్‌ను కల్పించింది. దీంతో ముందుగా బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులు, రూ.3,330కే తక్కువ ధరకే ఢిల్లీకి వెళ్ళే అవకాశాన్ని పొందారు.
దేశ రాజధాని ఢిల్లీకి మొదటి విమాన సర్వీసును నడపాలని నిర్ణయించిన ఇండిగో ఎయిర్‌లైన్స్, కొద్ది రోజులుగా తమ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ కూడా ఓపెన్ చేసింది. ఢిల్లీకి విమాన సర్వీసును నడుపుతున్నట్టు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన సందర్భంలో టికెట్ మినిమం ధర రూ.5,520గా ఉంది. సాధారణంగా ఢిల్లీకి ముందస్తుగా బుక్ చేసుకుంటే మిగతా ట్రావెల్స్ దాదాపు రూ.6,000 ఆ పైన ఉంటుంది. ఎయిర్ ఇండియా సంస్థ వసూలు చేస్తున్న ఛార్జీలతో విమాన ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో కొత్తగా ప్రారంభిస్తున్న ఇండిగో భారీ తగ్గింపునిస్తుందని ఆశించారు. అయితే ఈ ప్రారంభ ఆఫర్ ఏమీ లేకపోవటంతో చాలామంది నిరాశ చెందారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు రూట్లలో విమానాలు నడిపేటపుడు ఒక్కసారిగా విమాన ఛార్జీల ధరలను సవరించింది.
దీంతో మిగిలిన విమానయాన సంస్థలు కూడా ధరలను తగ్గించాయి. ఢిల్లీ రూట్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తే.. మొదట్లో అలా జరగలేదు. కాని ఇప్పుడు, అనూహ్యంగా ఇండిగో సంస్థ వెబ్‌లో ఛార్జీలను తగ్గిస్తూ ప్రకటించింది. బుకింగ్ కల్పించిన మొదటి వారం తర్వాత రూ.3,330, మధ్యలో రూ.2,220కు కూడా టిక్కెట్ లభించే అవకాశాన్ని కల్పించింది. ఢిల్లీకి తొలి విమాన సర్వీసును అక్టోబర్ 1వ తేదీన నడపాలని ఇండిగో ముహూర్తం నిర్ణయించింది. తెల్లవారుజాము సమయంలో ఈ విమాన సర్వీసును నడపబోతోంది. దీంతో ఢిల్లీకి ఉదయం 9 - 10 గంటల మధ్యలోనే చేరుకునే అవకాశం ఉంటుంది.