ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 25 మంది మంత్రులతో ఈరోజు ఏపీ కేబినెట్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, , చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి కొత్తగా ఇన్నోవా కార్లను కేటాయించింది. ఒకేసారి ఏడుగురు సభ్యులు ప్రయాణించగల టయోటా ఇన్నోవా కార్ల ప్రారంభ ధర మార్కెట్ లో రూ.14.93 లక్షల నుంచి రూ.23.24 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో మార్కెట్ లో లభ్యమవుతోంది.
ఈ 25 మంది మంత్రులకు జగన్ ఏయే బాధ్యతలు అప్పగించబోతున్నారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు సాయంత్రం నాటికి సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెులిపాయి. మొత్తం 25 మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులుగా వరుస క్రమంలో మొదట శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రమాణం చేశారు. ఆతర్వాత మిగిలిన మంత్రులు ప్రమాణం చేసి జగన్, గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన గౌతంరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.