ప్రతిపక్ష నాయుకుడు జగన్ మోహన్ రెడ్డి, చేస్తున్న పాదయాత్ర పై, ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. ఇప్పటి వరకు పది జిల్లాల్లో జరిగిన పాదయాత్ర తీరు, ప్రజల స్పందన, ప్రభుత్వం పై ప్రభావం, ఇలా అన్ని విషయల పై ఇంటలిజెన్స్ నివేదిక రూపొందించింది. జగన్ ప్రసంగాలకు ఏ విధంగా స్పందన వస్తోంది? పాదయాత్రకు వచ్చే జనంలో ఎంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు? ఎంతమందిని పార్టీ నాయకులు సమీకరిస్తున్నారు..? తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసింది. సీఎం చంద్రబాబుపై ప్రతిపక్షనేత జగన్ పాదయాత్రలో చేస్తున్న విమర్శలను వైసీపీ కార్యకర్తలు, ప్రజలు ఏ రీతిలో స్వీకరిస్తున్నారనేదానిపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే, ప్రజా సమస్యల పై కాకుండా, వ్యక్తిగతంగా చంద్రబాబుని టార్గెట్ చెయ్యటంతో, అవి సామాన్య ప్రజల్లో ఏ మాత్రం స్పందన లేదని, వైసీపీ కార్యకర్తలకు మాత్రమే జోష్ నింపుతుందని తేల్చారు.
అలాగే జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న హామీల పై, ప్రజలు అసలు నమ్మటం లేదని చెప్తున్నారు. అందుకే, జగన్ అసలు తన హామీల విషయమే మర్చిపోయారని, ఆయన నోటి వెంట నవరత్నాలు అనే మాట వచ్చి చాలా రోజులు అయ్యిందని, అసలు విషయం మర్చిపోయి, కేవలం చంద్రబాబుని తిట్టటం కోసమే పాదయాత్ర అంతా సరిపోతుంది అని అంటున్నారు. మరో పక్క, ప్రజల సమస్యల గురించి తెలుసుకోకుండా, ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం నడుచుకుంటూ వెళ్లిపోవటం, దారిలో ఎవరన్నా కనిపిస్తే వారితో మాట్లాడటం, సాయంత్రం మీటింగ్, ఇలా ప్రజలతో సంబంధం లేకుండా, రాజకీయ షో గా వెళ్ళిపోతుందని తేల్చారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకోయినా ఆ నెపం చంద్రబాబుదే అన్నట్లు జగన్ చేస్తున్న ఆరోపణలపై ప్రజలలో సానుకూల స్పందన వస్తుందా? లేదా వ్యతిరేఖత వస్తుం దా? అనేదానిపైనా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిసింది.
మోదీని, బీజేపీ నాయకులపైనా జగన్ విమర్శలు చేయకపోవడంపై ఆ పార్టీతో లాలూచీ అయ్యారని ఎంతమంది నమ్ముతున్నారు? కేసులకు భయపడి జగన్ మోదీపై విమర్శలు చేయడంలేదన్న వ్యాఖ్యలు పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రసంగ సమయంలోనే చర్చించుకుంటున్న అంశాలను ఇంటిలిజెన్స్ గుర్తించినట్లు సమాచారం. నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్‌లకే జన సమీకరణ బాధ్యతలు ముందుగానే అప్పగిస్తున్నారన్న విషయం కూడా ఇంటిలిజెన్స్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. పాదయాత్రకు వారం రోజులు ముందే ఆయా నియోజకవర్గ కోఆర్డినేటర్‌కి చేయాల్సిన ఏర్పాట్ల పై పలు అంశాలతో కూడిన సూచనలు ఇస్తున్నారని, అవి తు.చ తప్పకుండా పాటించాలని వైసీపీ నుంచి ఆదేశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, జగన్ చేస్తున్న ఆరోపణలు, ఎప్పటికప్పుడు స్థానిక తెలుగుదేశం నేతలు స్పందించక పోవటం మాత్రం, ఒక మైనస్ గా చెప్తున్నారు. ఇలాంటి అనేక అంశాలపై ఇంటిలిజెన్స్ లోతైన పరిశీలన జరిపి నివేదిక రూపొందిస్తోంది.