రాజధాని అమరావతిలో తొలి సెమీకండక్టర్ డిజైన్ పార్కు ఏర్పాటుకానుంది. సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇన్వెకాస్ సంస్థ అమరావతిలో సెమీకండక్టర్ల తయారీ పార్కును ఏర్పాటుచే సేందుకు ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ సెమీ కండక్టర్ పార్కు కార్యకలాపాలు ప్రారంభమైతే 5000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సెమీకండక్టర్ డిజైన్ పార్కు వల్ల ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబుతో దీనికి శంకుస్థాపన చేయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ గ్లోబల్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్న ఇన్వికాస్ కంపెనీకి ఆ రోజు శంకుస్థాపన చేస్తారు. ఈ కంపెనీతో పాటు మరో 10 సెమీకండక్టర్ డిజైన్ అండ్ రిసెర్చ్ కంపెనీలు రానున్నాయి. ఈ కంపెనీలన్నింటితో కలిపి సెమీకండక్టర్ డిజైన్ పార్కు ఏర్పడుతుంది.
అమరావతిలోని నీరుకొండ గ్రామ ప్రాంతంలో ఇది ఏర్పాటుకానుంది. దీనికి 50 ఎకరాలు కావాలని సదరు కంపెనీలు అడుగుతున్నాయి. అయితే ప్రభుత్వం 37-40 ఎకరాల మధ్యలో కేటాయించనుందని సమాచారం. అమరావతిలో ఐటీ అభివృద్ధికి ఈ సెమీకండక్టర్ డిజైన్ పార్కు మరింత ఊతమిస్తుందని అంటున్నారు. ఇప్పటివరకూ అమరావతికి సమీపంలోని మంగళగిరి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పలు బీపీవో కంపెనీలు, ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు వచ్చాయి. అయితే వేగంగా అభివృద్ధి చెందేందుకు, ఐటీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రిసెర్చ్ సంస్థలు అవసరం. ఆ దిశగా తొలి అడుగు పడనుంది. నూతన రాజధాని అమరావతి పరిధిలోనే ఇది రానుంది.
మరోవైపు రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఏపీఎన్ఆర్టీ భవన్కు ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. రూ.400 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. ఐదు ఎకరాల్లో... 33 అంతస్థులు.. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఒక ఐకానిక్ భవనంగా దీన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వానికి పైసా ఖర్చులేకుండా ఏపీఎన్ఆర్టీ సొసైటీ దీనికి నిధులు సమకూరుస్తుంది. ఈ భవనంలో ఐటీ కంపెనీలు, వివిధ సంస్థల కార్యాలయాలు కూడా ఏర్పాటవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐకానిక్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనంలోని 120 ఫ్లాట్లను ఎన్ఆర్ఐలకు విక్రయిస్తారు. వారు వీటిలో నివాసం ఉండొచ్చు.. లేకుంటే ఏవైనా ఐటీ కంపెనీలకు అద్దెకు ఇచ్చుకోవచ్చు.