గుంటూరు జిల్లా కొండవీడు సమీపంలో నిర్మిస్తున్న ఇస్కాన్ స్వర్ణమందిర ఆలయం నిర్మాణం జూన్ నాటికి తొలిదశ పూర్తి కానుంది. కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో కొండవీడు కోట, కొండపై ఉన్న ప్రకృతి అందాలను తిలకించడానికి క్రమంగా పర్యటకుల సందడి మొదలైంది. ఈ క్రమంలో కొండవీడు సమీపంలో రూ.200 కోట్లతో ఇస్కాన్ ఆలయం, వేద విశ్వవిద్యాలయం, ఆవులపై పరిశోధన కేంద్రం, గురుకుల పాఠశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా ప్రగతి పట్టాలెక్కనుంది. తొలిదశ నిర్మాణాన్ని రూ.100 కోట్లతో పూర్తి చేసే దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయి.
రాజస్థాన్ నుంచి తెచ్చిన గులాబిరంగు నాపరాయితో 108 మండపాలను ప్రధాన మందిరం చుట్టూ ఆకర్షణీయంగా నిర్మించారు. ప్రధాన ఆలయ నిర్మాణం మొదలైంది... ఇవి వరుసగా భాగవతం ఇతివృత్తం వివరించే చిత్రాలులా ఉంటాయి... పస్చిమబంగ నుంచి వచ్చిన కార్మికులు బొమ్మల తయారీ చేస్తున్నారు... ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేలా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. కొండవీడు కోట, చారిత్రక వెన్నముద్ద గోపాలస్వామి ఆలయం, పురాతన ఆలయాలతో పాటు ఇస్కాన్ వారు నిర్మిస్తున్న ఆలయం పూర్తి కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది.
ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయంలో కృష్ణుని ఆలయంతో పాటు విజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న స్వర్ణహంస మందిరం, కొండవీడు కొండల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలితో ఈ ప్రాంతం మొత్తం సాయంత్రమైతే ఆహ్లాదంగా మారుతోంది. ఇక్కడే వేద విశ్వవిద్యాలయంతో పాటు గురుకుల పాఠశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్, సాంస్కృతిక పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆవుకు సంబంధించి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఇస్కాన్ ఆధ్వర్యంలో బృందావనం, మాయాపూర్, బెల్గాం తదితర ప్రాంతాల్లో ఆవు, ఆవు వ్యర్థాలతో మందుల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి.