ఎన్నికల సమయంలో ఐటీ దాడులు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఈరోజు కూడా తమ తనిఖీలను కొనసాగించారు. గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని సాంబశివ నర్సింగ్ హోంపై మంగళవారం మధ్యాహ్నం నరసారావుపేట ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురజాల తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడైన పులికూరి కాంతారావుకు చెందిన ఆసుపత్రి, ఇంటిపై ఈ దాడులు జరిగాయి. వీటికి సంబంధించి కాంతారావు సరైన పత్రాలు చూపించడంతో అధికారులు ఒంటి గంట సమయంలో వెనుదిరిగారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు ఏమైనా ఉందా అనే కోణంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గురజాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.
గురజాలలో మంగళవారం జరిగిన రోడ్‌షోలో కేసీఆర్, వైఎస్ జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తా అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మడానికి వీల్లేదని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ జిత్తులమారి నక్క లాంటోడని.. మాట మార్చడంలో దిట్ట అని మండిపడ్డారు. హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టీఆర్ఎస్ ఎందుకు సహకరించలేదని, సోనియా గాంధీ ఏపీకి హోదా ఇస్తానని చెప్పినప్పుడు ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లో కూర్చొని కేసీఆర్‌కు ఊడిగం చేస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇద్దరూ కలిసి ఏపీలో ఏడున్నర లక్షల ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. వైఎస్ జగన్ వెనుక కేసీఆర్, మోదీ ఉన్నారని.. ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు కలవకపోతే ఏపీలో కక్ష సాధింపు పనులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. బండబూతులు తిడుతున్నాడు. నేను సన్నాసినా.. ఏం తమ్ముళ్లూ మీ ముఖ్యమంత్రి సన్నాసేనా? ఏం చెల్లెమ్మలూ మీకు కోపం రాలేదా? ఏపీ ప్రజలను కేసీఆర్ ఎంతలా అవమానించాడు.. మన బిర్యానీ పేడలా ఉంటుందన్నాడు. మన ఉలవ చారు వాళ్ల దగ్గర పశువులకు పెడతామని తిట్టాడు. ఇలాంటి కేసీఆర్ మాటలను మీరు నమ్ముతారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.