రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేదాకా వరుస సోదాలతో ఐటీ అధికారులు హడావుడి చేశారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఉద్రిక్తత సర్వత్రా కనిపించింది. పొరుగు రాష్ట్రాలనుంచీ అదనపు సిబ్బందిని రప్పించుకొని ఏకకాలంలో, ముందుగా ఎంచుకొన్న కంపెనీలు, వ్యాపారుల సంస్థలపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. గుంటూరులో ఐదు చోట్ల, విజయవాడలో మూడు సంస్థలపై, విశాఖలో రెండు ఆఫీసులపై, ప్రకాశం జిల్లాలో ఒకే నేతకు చెందిన పలు సంస్థలపై దాడులు మొదలుపెట్టారు. నెల్లూరులో టీడీపీ సీనియర్ నేత బీద మస్తానరావుకు (బీఎమ్మార్) చెందిన సంస్థల్లో సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి.
రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు స్థిరాస్తి సంస్థలు, పరిశ్రమలు, రొయ్యల ఎగుమతి సంస్థలకు చెందిన కార్యాలయాలు, వాటిని నిర్వహిస్తున్నవారు, అందులో పనిచేస్తున్న ముఖ్యమైన ఉద్యోగుల ఇళ్లలో ఉదయంనుంచి రాత్రి వరకూ విస్తృతంగా తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల కూడా తనిఖీలు చేశారు. వీటిల్లో పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సంస్థలూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో తెదేపా ముఖ్య నేత బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థల్లోనూ, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు(ఈయన వైకాపా నుంచి తెదేపాలో చేరారు) చెందిన పరిశ్రమల్లోనూ, విశాఖలో నంబూరు శంకరరావు (రేవంత్‌రెడ్డి సన్నిహితుడని ప్రచారం ఉంది. వైకాపాలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు) సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
విజయవాడలో శుక్రవారం తెల్లవారుజామునే ఐటీ అధికారులు తమ పని మొదలుపెట్టారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మొత్తం 9 బృందాలు గురువారం రాత్రికే విజయవాడ చేరుకొన్నాయి. తెలతెలవారుతుండగానే తనిఖీలు మొదలుపెట్టారు. తొలుత సదరన్ డెవలపర్స్‌లో, అనంతరం వరుసగా శుభగృహ, వీఎస్ ఎకో బ్రిక్స్‌లో తనిఖీలు చేపట్టాయి. బెంజ్ సర్కిల్‌లోని నారాయణ విద్యాసంస్థ కార్యాలయానికి వెళ్లినా, ఏమనుకున్నారోఏమోగానీ తనిఖీలు జరపకుండానే వెనువెంటనే వెనుదిరిగారు. అప్పటికే సమాచారం అందడంతో మీడియా.. మహాత్మాగాంధీ రోడ్‌లోని సదరన్ డెవలపర్స్ వద్దకు చేరుకొంది. గుంటూరుకు చెందిన వల్లభనేని శ్రీనిసవారావు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో ఏర్పాటుచేసుకొన్న వీఎస్ ఎకో బ్రిక్స్‌లో మరో టీమ్ తనిఖీలు జరిపింది.