ఈ దేశంలో ఎవరు ప్రశ్నిస్తే వారి పై ఐటి దాడులు జరుగుతున్న సీజన్ ఇది. రాజకీయ నాయకులే కాదు, ఇప్పుడు మీడియా సంస్థల పై కూడా ఐటి పంజా విసిరింది. మీడియా టైకూన్‌, క్వింట్‌ న్యూస్‌ పోర్టల్‌, నెట్‌వర్క్‌18 వ్యవస్థాపకుడు రాఘవ్‌ బహ్ల్‌ నివాసం, కార్యాలయంలో ఆదాయ పన్ను విభాగం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణల పేరుతో గురువారం ఉదయం నోయిడాలోని ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. క్వింట్‌ న్యూస్‌లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కథనాలు వస్తున్న నేపథ్యంలోనే ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమవుతోంది.

it 12102018 2

ప్రత్యేకించి, రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారంలో మోదీ సర్కారును తప్పుబడుతూ క్వింట్‌ న్యూస్‌లో పలు కథనాలు వచ్చాయి.సోదాలు జరిగినప్పుడు రాఘవ్‌ ఇంట్లో లేరు. ముంబై నుంచి ఢిల్లీ వస్తున్నారు. సోదాల గురించి తెలిసిన వెంటనే ఆయన ఎడిటర్‌ గిల్డ్‌కు సమాచారమిచ్చారు. ఇంట్లోకి ప్రవేశించిన అధికారులు.. తన తల్లి, భార్యను ఎవరితోనూ మాట్లాడకుండా నిరోధించారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. క్వింట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రీతూ కపూర్‌ ఇంటిపైనా ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాలను ఎడిటర్‌ గిల్డ్‌ ఖండించింది.

it 12102018 3

ఐటీ విభాగం తమ అధికారాలకు లోబడి పనిచేయాలే తప్ప ప్రభుత్వ విమర్శకులను భయపెట్టేలా వ్యవహరించకూడదని వ్యాఖ్యానించింది. ఈ దాడులు పత్రికా స్వేచ్ఛపై కొరడా ఝుళిపించడమేనని ఇండియన్‌ ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. కేంద్రంపై వాస్తవాలు రాస్తున్నందుకే బహుమతిగా క్వింట్‌పై దాడులు నిర్వహించారని కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరీ దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా కూడా క్వింట్‌పై దాడులను ఖండించారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమాత్రం జంకని అతికొద్ది మీడియా ప్రముఖుల్లో రాఘవ్‌ ఒకరన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read