తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణం మోబర్లీపేట ప్రాంతంలోని తెదేపా నాయకుల ఇళ్లల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఉదయం పదకొండున్నర గంటల సమయంలో మొదలైన సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి. మూడు బృందాలుగా వచ్చిన అధికారులు పట్టణానికి చెందిన తెదేపా నాయకులు అల్లాడ స్వామినాయుడు(సోంబాబు), అల్లాడ శరత్‌బాబు, అల్లాడ శ్రీనివాసు ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ (రాజమహేంద్రవరం) ఎం.వి.రమేష్ నేతృత్వంలోని బృందం తొలుత అల్లాడ శరత్‌బాబు ఇంట్లోకి ప్రవేశించి వ్యాపారాది వ్యవహారాలపై ఆరా తీసింది. అక్కడ నుంచి శ్రీనివాసు, స్వామినాయుడు గృహాల్లోకి వెళ్లి పలు వివరాలు సేకరించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమలాపురంలో ఐటీ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి.
ముగ్గురు ఇళ్లలో కీలక డాక్యుమెంట్లతోపాటు ఇతర బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మోబర్లీపేటలో నివాసముంటున్న అల్లాడ స్వామినాయుడు, అల్లాడ వాసు, అల్లాడ శరత్‌లకు చెందిన ఇళ్లపై పదిమంది సభ్యులతో కూడిన ఐటీ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి ముగ్గురి సోదరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈసోదాల్లో కీలక డాక్యుమెంట్లు, కొంత నగదుతోపాటు ఇతర లావాదేవీలపై సోదాలు చేస్తున్నారు. ఇన్‌కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎంవీ రమేష్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రాత్రి 9 గంటల సమయంలో కూడా సోదాలను కొనసాగిస్తున్నారు. ఇటీవలకాలంలో అల్లాడ సోదరులకు సంబంధించిన కొంత భూమిని విక్రయించారు. దాని విలువ రూ.12 కోట్లుగా చూపడంతో ఆ భూమి లావాదేవీలపై అనుమానం వచ్చిన అధికారులు ప్రధానంగా దృష్టిసారించి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
గతంలో అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాల్లో భాగస్వామ్య వ్యవహారాలపై కూడా దృష్టిసారించారు. అదేవిధంగా ఆడిటర్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించిన తర్వాత కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తొలుత అల్లాడ స్వామినాయుడు ఇంటి వద్ద సోదాలు జరిపారు. ఆ తర్వాత అల్లాడ వాసు, శరత్ ఇళ్లలోనే ఐటీ అధికారులు సోదాలు రాత్రి సమయంలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఎవరో అజ్ఞాతవ్యక్తి మూడు నెలల క్రితం అల్లాడ సోదరుల లావాదేవీలపై ఐటీశాఖకు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని వీరి లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటీ అధికారులు సోమవారం ఈ ఆకస్మిక దాడులకు దిగారని ప్రచారం కూడా జరుగుతోంది. అల్లాడ సోదరులు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూండటంతో ఐటీ దాడులు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.