తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) మళ్లీ దాడులు మొదలుపెట్టింది. టీడీపీ నేతలు లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలు, సానుభూతి పరుల పై ఐటి దాడులు చేసి, ఏమి దొరక్క, మీడియాకు తప్పుడు లీక్ లు ఇచ్చి, హంగామా చేసారు. అయితే, ఈసారి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కార్యాలయాల్లో సోదాలు చేశారు. పోలింగ్‌కు ముందు బీద మస్తానరావు, ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన తర్వాత మరోసారి ఐటీ గురి పెడుతుందని పార్టీ నేతలు ముందుగానే ఊహించారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఈ అంశంపై ప్రచారం జరగ్గా శనివారం అదే జరిగింది.
టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి చెందిన పలు సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. చెన్నైలోని టి.నగర్ బజుల్లా రోడ్డులో ఉన్న బాలాజీ గ్రూప్ ఆఫీసు, పూందమల్లిలో ఉన్న ఎండ్రికా ఎంటర్‌ప్రైజెస్ డిస్టిలరీస్ ఫ్యాక్టరీ, మాగుంట కుటుంబానికి చెందిన సన్నిహితుల కార్యాలయాలు.. ఇలా పదిచోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. డిస్టిలరీ ఫ్యాక్టరీలో లెక్కల్లో చూపని నగదు భారీగా పట్టుబడినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే ఎప్పటిలాగే, ఐటీ అధికారులు దీనిని ధృవీకరించలేదు. కేవలం బురద చల్లారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రమే పక్కా ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగిన ఐటీ అధికారులు శనివారం కూడా సోదాలు కొనసాగించారు.
ఆదివారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై టీనగర్‌లోని బాలాజీ సంస్థల ప్రధాన కార్యాలయంలోను, పూందమల్లిలోని ఆ సంస్థతో పాటు, మరో కంపెనీలోను తనిఖీలు చేశారు. టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, వారి వ్యాపారాలపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని పార్టీ నేతలు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. ఈ దిశగానే సోదాలు జరుగుతుండటం ఈ అనుమానాలు మరింత బలపరుస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల సందర్భంగా కొంత విరామం ఇచ్చి మళ్లీ మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. ఇవి మరికొంత కాలం కొనసాగుతాయని సమాచారం. దీనికోసమే పలు ఐటీ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోనే మకాం వేసి, తమకు అందిన ఆదేశాల మేరకు దాడులు చేస్తారని అంటున్నారు.