వివిధ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటిసి లిమిటెడ్... సుమారు 250 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్మిస్తోంది. క్రిందటి ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హోటల్‌కు శంకుస్థాపన చేశారు. గుంటూరులో కంపెనీకి ఉన్న అతిథి గృహాన్ని తొలగించి ఆ స్థానంలో ఐటిసి ఈ హోటల్‌ను నిర్మిస్తోంది.
‘మై ఫార్చూన్’ పేరుతో, 1.44 ఎకరాల విస్తీర్ణంలో, 12 అంతస్తులతో మొత్తం 300 గదులను ఐటిసి ఈ హోటల్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. హోటల్ నిర్మాణానికి సంబంధించి పనులు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతున్న తొలి ఫైవ్ స్టార్ హోటల్ ఐటిసిదే.
మరో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ళు
ఐటిసి లిమిటెడ్ మరో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ళు నిర్మించటానికి రెడీగా ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఐటీసీకి సొంత స్థలాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో స్థలం కేటాయిస్తే అక్కడ కూడా ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తామని ఐటిసి అధికారులు చెబుతున్నారు.
గుంటూరులో ఇప్పటికే నిర్మిస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ ఫోటోలు ఇవే...