టీవీ9 ఛానెల్ లో, ముఖాముఖి కార్యక్రమం ద్వారా, తనదైన ముద్ర వేస్తూ, పొలిటికల్ ఇంటర్వ్యూ లు చేసే జాఫర్ అంటే తెలియని వారు ఉండరు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సంచలనాలు, వివాదాలు ఉండటంతో, ఈ షోకి టీఆర్పీలు కూడా ఎక్కువే. తద్వరా టీవీ9కి కూడా టీఆర్పీ పెరిగేది. యుట్యూబ్ లో వ్యూస్ కూడా అధికంగా వచ్చేవి. దాదపుగా 175 ఎపిసోడ్ లు నడిచింది ఈ ప్రోగ్రామ్. అయితే నిన్నటి నుంచి, టీవీ9, జాఫర్ చేత బలవంతంగా రాజీనామా చేపించి, పంపించేసారు అనే వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేసాయి. సీనియర్ జర్నలిస్ట్ అయిన జాఫర్ ని అర్దాంతరంగా తప్పించారని, ఆయన చేత బలవతంగా రాజీనామా చేపించారని, ఆ ప్రచారంలోని సారంశం. గతంలో టీవీ9కు కర్త, కర్మ, క్రియగా ఉన్న రవి ప్రకాష్ ను, టీవీ9 నుంచి తప్పించి, కొత్త యాజమాన్యం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే అప్పటి నుంచి, రవి ప్రకాష్ కు సన్నిహితంగా ఉండే స్టాఫ్ ని తీసేస్తూ వచ్చారు. అయితే రవి ప్రకాష్ కు సన్నిహితుడగా ఉండే జాఫర్ ని మాత్రం, తప్పించలేదు. అయినా జాఫర్ ఎప్పటి లాగే, తన ముఖాముఖి షో చేస్తూ వస్తున్నారు. నిన్న ఉన్నట్టు ఉండి, ఆయనను రాజీనామా చేపించటం సంచలనంగా మారింది. దీనికి కారణం, ఆయన రవి ప్రకాష్ ను కలిసారని. ఓకే మాజీ బాస్ ను కలిస్తేనే, రాజీనామా చేస్తారా, ఒక సీనియర్ జర్నలిస్ట్ కు ఇచ్చే గౌరవం ఇదేనా, 15 ఏళ్ళ నుంచి టీవీ9 లో పని చేస్తుంటే, ఇచ్చే బహుమానం ఇదా అంటూ, జాఫర్ తన సన్నిహితుల దగ్గర గోడు వెల్లబోసుకున్నారని సమాచారం. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల పై, అటు జాఫర్ కాని, టీవీ9 కాని స్పందించక పోవటంతో, ఈ వార్తా పై అనుమానాలు వచ్చాయి.
కాని, వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ, ఈ రోజు జాఫర్ ఒక మీడియా సందేశాన్ని విడుదల చేసారు. 15 ఏళ్ళుగా తనకు టీవీ9తో ఉన్న బంధం తెగిపోయిందని అన్నారు. ఈ ప్రయాణంలో 5 ఏళ్ళ పాటు, 175 ఎపిసోడ్ లు గా తీసిన ముఖా ముఖి కార్యక్రమం ఎంతో పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. ఇన్నేళ్ళు తనకు సహాయం చేసిన రవి ప్రకాష్ తో పాటుగా, 175 ఎపిసోడ్ లలో, తనతో షో చెయ్యటానికి వచ్చిన అతిధులకు కూడా ధన్యవాదాలు చెప్పారు. టీవీ9 మీద కాని, ఎవరి మీద తనకి కోపం లేదని అన్నారు. కొన్ని రోజులు ఫ్యామిలీతో గడుపుతానని, తరువాత ఎటు వెళ్ళాలి అనే దాని పై ఆలోచన చేస్తానాని జాఫర్ అన్నారు. అయితే, 15 నిమిషాల ఈ వీడియోలో, ఆయన ప్రస్తుత టీవీ9 యాజమాన్యం పై కాని, తనను తప్పించటం పై కాని, ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.