నిన్న అమరావతి విషయంలో హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతి విషయంలో అమరావతే రాజధాని అని హైకోర్టు చెప్పటం ఒక అంశం. ఇది రైతులకు, అమరావతి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో సంతోషించే అంశం. ఇక వైసీపీ వాళ్ళు, ఇది రాజకీయంగా వాడుకుందాం అనే ప్లాన్ లో ఉన్నారు. చంద్రబాబు మ్యానేజ్ చేసాడని, చంద్రబాబు మూడు ప్రాంతాలకు వ్యతిరేకం అని, అమరావతి చంద్రబాబు బినామీ అని ఇలా అనేకం చెప్పుకుంటూ ఉంటారు. అయితే వాళ్లకు దీని కంటే ముందు అర్ధం కాని విషయం, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కుంది. నిన్న హైకోర్టు ఇచ్చిన 300 పేజీల అమరావతి తీర్పులో అనేక సంచలన విషయాలు, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గుండె గుబేల్ మనే విషయాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేక పోతుంది. పనులు చేసే వాళ్ళు లేరు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఉంది. అప్పులు చేస్తే కానీ రోజు వారీ కూడా గడవని పరిస్థితి. ఆర్ధిక మంత్రి బుగ్గన ఢిల్లీ చుట్టూ అప్పుల కోసం తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు, జగన్ కు మామూలు షాక్ కాదనే చెప్పాలి.
ఇందులో కోర్టు ముఖ్యంగా చెప్పిన అంశం, అమరావతిని అభివృద్ధి చేయాలి, సీఆర్డీఏ చట్ట ప్రకారం, అందులో చెప్పిన అంశాలు, అలాగే చెయ్యాల్సిన పనులు చేసి తీరాల్సిందే అని కోర్టు చెప్పింది. నవ నగరాల నిర్మాణం పూర్తి చేయాలనీ చెప్పింది. రైతులకు ఆన్ని సౌకర్యాలతో భూములు అభివృద్ధి చేయాలని, అంటే డ్రైనేజి, రోడ్డులు, లైట్లు, విద్యుత్, తాగు నీరు ఇలా అన్నీ సదుపాయాలతో మూడు నెలల్లో వారికీ ప్లాట్లు ఇవ్వాలని తెలిపింది. రాజధాని నగరాన్ని ఆరు నెలల్లో నిర్మించాలని, ఒప్పందం ప్రకారం ఇది చేయాలని చెప్పింది. అలాగే భూములు అమరావతి రాజధాని కోసం తప్ప, దేనికీ కూడా తనఖా పెట్టటానికి వీలు లేదని చెప్పింది. పనులు పురోగతి ఎప్పటికప్పుడు కోర్టుకు చెప్పాలని కోర్టు తేల్చి చెప్పింది. ఇక అమరావతి పిటీషన్లు వేసిన వారికి, రూ.50వేల చొప్పున ఖర్చులకు ఇవ్వాలని కూడా కోర్ట్ చెప్పింది. అసలకే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న జగన్ ప్రభుత్వం, ఇవన్నీ ఎలా చేయాలి ? చేయకపోతే కోర్టు దిక్కరణ అవుతుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుంది ? కోర్టుని మరింత సమయం అడుగుతుందా ? లేక సుప్రీం కోర్టుకు వెళ్లి, ఈ తీర్పు రద్దు చేయాలని కోరుతుందా ? ఏమి జరుగుతుందో చూడాలి మరి.