జగన్ సభలో ప్రసంగిస్తుండగా అంబులెన్స్ రావడం.. ఆ అంబులెన్స్‌ను ప్రభుత్వమే పంపించి వికృత చర్యలకు పాల్పడుతుందని జగన్ శాపనార్థాలు పెట్టడం.. ఆ అంబులెన్స్‌కు దారిచ్చి పంపాలని జగన్ సభకొచ్చిన కార్యకర్తలకు పిలుపునివ్వడం.. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ అంబులెన్స్‌లో పేషెంటే లేడని జగన్ చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే జగనే ఈ డ్రామాకు తెరలేపాడని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించాయి. అయితే హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశంపై మంత్రి దేవినేని ఉమ స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై ఆరా తీశామని.. సభలో పాల్గొన్న ఓ వైసీపీ కార్యకర్తకు దెబ్బతగిలితే ఆ పార్టీ కార్యకర్తలే అంబులెన్స్ పంపించాలంటూ ఫోన్ చేశారని తెలిపారు. ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోకుండా జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన సభలో 108 వాహనం వెళ్తుంటే, జగన్ ప్రభుత్వం పై వాడిన భాష నికృష్టమని మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. గరివి మండలం తాటిపూడి గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త వల్లూరి శ్రీనివాస్ లారీ లో జగన్ సభ కు వచ్చాడని తెలిపారు. అతన్ని ఆటో ఢీ కొట్టగా, వైకాపా కార్యకర్తలే 108 వాహనంలో తరలించారని చెప్పారు. అతను ప్రస్తుతం మొవ్వ గోపాల్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రత్యామ్నాయ రోడ్డు లేక జగన్ సభ జరుగుతున్న దారి లో 108 వాహనాన్ని తీసుకెళ్లారని తెలిపారు. నీ సభ కి వచ్చిన కార్యకర్తకి దెబ్బ తగిలితే, అతన్ని నీ కార్యకర్త లే ఆసుపత్రికి తరలిస్తే, దానికి ప్రభుత్వం పై విమర్శలు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. దిగజారి జగన్ డ్రామా లు, నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు.
2019 లో బీజేపీ కి 12 ఎంపి సీట్లు, వైసిపి కి 21 సీట్లు వస్తాయని సర్వే లను నమ్ముకుని జగన్ ఊహాలోకంలో బతుకుతున్నాడన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన జగన్ 420 అని 2014 లో ప్రజలు పక్కన పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శాసన సభ కు రాకుండా, కోట్ల జీతభత్యాలు తీసుకుంటూ, ఉత్తర కుమారుడు లా పారిపోయిన జగన్ కు తమను విమర్శించే అర్హత ఎక్కడుందని మండిపడ్డారు. శాసనసభ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేక రోడ్ల మీద తిరుగుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఐటీ దాడులకు ప్రభుత్వం భయపడుతోందని జగన్ మాట్లాడుతున్నాడని, 1982 మార్చి లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన నాటి నుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోరాటం చేసిన చరిత్ర తమదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి, అరెస్ట్ అయ్యి జైలు కి వెళ్లామని గుర్తుచేశారు. అలాంటి మేము ఐటి దాడులకు ఎందుకు భయపడతామన్నారు.