వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురుకి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా జగన్ ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక మరో 20 మందికి మంత్రులతో సీఎం జగన్ కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలతో కలిపి మొత్తం 25మంది మంత్రులతో జగన్ ప్రభుత్వం పరిపాలన సాగించనుంది. అయితే.. తాడేపల్లిలో శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం నిర్వహించారు. పాలనపై దిశానిర్దేశం చేశారు. మంత్రి వర్గ ఏర్పాటుకు సంబంధించి అన్ని విషయాలు చెప్పిన జగన్.. ఎవరు మంత్రులనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
మంత్రులుగా ఖరారైన వారికి సాయంత్రం ఫోన్ కాల్ వస్తుందని, అప్పటి వరకూ వేచి ఉండాలని జగన్ చెప్పారు. దీంతో ఆశావహులంతా ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. విజయసాయిరెడ్డి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలని చెప్పనున్నట్లు తెలిసింది. అయితే.. మంత్రుల జాబితాను ప్రకటించడంలో సీఎం జగన్ ఇంత గోప్యత పాటించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తుల విషయంలో ఆందోళన చెందే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది. పైగా.. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పిన జగన్ ఇంత రహస్యంగా మంత్రివర్గాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏంటో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. కేబినెట్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్ ప్రకటించడంతో ఎవరెవరికి అవకాశం వస్తుంది..? ఇవాళ సాయంత్రం ఫోన్లు ఎవరెవరికి వస్తాయా..? అనేదానిపై సర్వ్రతా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పడంతో కచ్చితంగా ముఖ్యనేతలందరికీ అవకాశం వస్తుందని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్‌లో సీఎం జగన్ కార్యాలయం ఉంది. శనివారం ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.