తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే తామే గెలిచినంతగా సంబరపడిపోవడం.. టీడీపీ ఓడిపోవడం తమ విజయమేనన్న రీతిలో వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకోవడం ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకతకు దారితీసిందని ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మెడకు చుట్టుకుంటోందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రత్యర్థి, సీఎం చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రశంసించడం.. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం.. క్షీరాభిషేకాలు చేయడం.. రాష్ట్రంలో పర్యటించాలంటూ వారిని తమ పార్టీ నేతలు, శ్రేణులు ఆహ్వానించడం వారికి మింగుడుపడడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదని కేసీఆర్ బహిరంగంగానే చెబుతున్నారు. మన రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
సుప్రీంకోర్టులో ఇంప్లీడయ్యారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేసీఆర్‌నూ, కేటీఆర్‌నూ ప్రత్యేకంగా కీర్తిస్తూ.. ఏకంగా టీఆర్‌ఎస్ జెండాలను భుజాన వేసుకుని వైసీపీ వర్గాలు రోడ్లపైకి రావడం చూసి జనం ఆగ్రహిస్తున్నారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు ప్రతిరోజూ జగన్‌పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. పోలవరం వద్దా.. ఇవి రావడం వైసీపీకి ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ఎదురుదాడి ఇలాగే కొనసాగితే.. అది ప్రజల్లోకి చేరితే మున్ముందు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తమకు రాష్ట్రమే ప్రధానమనే ధోరణిలో ప్రజల్లో ‘సెంటిమెంటు’ రగిలించి ఎన్నికల్లో విజయం సాధించారు. అందుకు భిన్నంగా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడే టీఆర్‌ఎ్‌సకు మద్దతు పలకడం రాజకీయంగా ఏమాత్రమూ వాంఛనీయం కాదని అంతర్గతంగా ఆ నేతలు అంగీకరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో కేసీఆర్, చంద్రబాబు మధ్య పోలికలు, తేడాలపై చర్చలు జరగడం పరిపాటేనని.. కానీ దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలే చర్చకు వస్తాయని వైసీపీ ముఖ్యనేతలు కొందరు అంగీకరిస్తున్నారు. జగన్‌ను, చంద్రబాబును పోల్చి చూసుకుని.. సీనియర్ నేతగా, పాలనాదక్షుడిగా చంద్రబాబు వైపే మొగ్గుతారని అంటున్నారు.