జగన్ పై ఉన్న అక్రమాస్తులు కేసులో, జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్, ఈ రోజు సిబిఐ కోర్టు ముందుకు వచ్చింది. అయతే ఈ సారి కూడా మళ్ళీ వాయిదా వేయించుకోవాలని చూసిన జగన్ తరుపు న్యాయవాదికి, సిబిఐ కోర్టు షాక్ ఇచ్చింది. దీంతో ఈ కేసు పూర్తి స్థాయి వాదనలు, ఈ మధ్యానం నుంచి మొదలు కానున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా , జగన్ మోహన్ రెడ్డి అక్రమ సంపాదన పొందారు అంటూ సిబిఐ 11 కేసులు, ఈడీ 5 కేసులు దాఖలు చేసాయి. ఆ సందర్భంలో జగన్ ని అరెస్ట్ చేసాయి కూడా. జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు. తరువాత ఆయనకు కండీషనల్ బెయిల్ లభించింది. ఇదే క్రమంలో ఆయన 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రిందట ఎంపీ రఘురామరాజు కృష్ణం రాజు, జగన్ బెయిల్ ని రద్దు చేయాలి అంటూ పిటీషన్ దాఖలు చేసి , అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే దీని పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు, జగన్ ని కోరగా, ఆయన దాదాపుగా నాలుగు వాయిదాల పాటు, కౌంటర్ దాఖలు చేయకుండా సాగదీసారు. అయితే ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన కోర్టు, కౌంటర్ దాఖలు చేయకపోతే, మేము కేసు విచారణ మొదలు పెడతాం అని చెప్పటంతో, కౌంటర్ దాఖలు చేసారు.
జగన్ దాఖలు చేసిన కౌంటర్ పై చట్ట ప్రకారం, పిటీషనర్ అని రఘురామరాజు మరో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉండటంతో, కోర్టు రఘురామరాజుని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తరువాత రఘురామ రాజు కౌంటర్ కూడా దాఖలు చేసారు. దీంతో ఈ కేసు ఈ రోజుకి వాయిదా పడింది. కోర్టు ఏమి చెప్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో, జగన్ తరుపు న్యాయవాదులు మరోసారి వాయిదా కోసం ప్రయత్నం చేసారు. రఘురామరాజు ఇచ్చిన కౌంటర్ పై, తాము రిప్లయ్ దాఖలు చేస్తామని, తమకు సమయం కావాలి అంటూ జగన తరుపు న్యాయవాదులు కోరారు. అయితే దీనికి కోర్టు ఒప్పుకోలేదు. చట్ట ప్రకారం వాళ్ళు ఇచ్చిన కౌంటర్ పై, మళ్ళీ మీరు లిఖితపూర్వక వివరణ ఇవ్వనవసరం లేదని, మీరు డైరెక్ట్ గా వాదనలు వినిపించవచ్చని, విచారణలో మీ వాదనలు వినిపించండి అంటూ కోర్టు షాక్ ఇచ్చింది. అంతే కాదు, మరో రోజుకి వాయిదా వేయకుండా, ఇరు వైపులా వాదనలకు సిద్ధం కావాలని, కేసుని మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.