వైసీపీ నాయకులు జిల్లాలో దొనకొండ ప్రాంతంపై దృష్టి సారించారు. ఇక్కడ భూముల కొనుగోళ్లుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఇటీవల వైసీపీ నాయకులు, వారి తరఫున రియల్ ఎస్టేట్ దళారుల తాకిడి పెరిగింది. ఇప్పటికే బేరసారాలు ప్రారంభయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంత వాసులతో పాటు విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి కూడా వైసీపీ నేతలు భూములను పరిశీలించి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలలోనూ స్పల్పంగా పెరుగుదల కనిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం కలిగిన వారే ఆవైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జగన్ సియం అయితే అమరావతి మూసేసి, దొనకొండ రాజధాని చేస్తారనే ప్రచారం బాగా చేస్తున్నారు.
2014 సాధారణ ఎన్నికల సందర్భంగా వైసీపీ అధికారాన్ని చేపడితే దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. కడప జిల్లాకు చెందిన వారు, ప్రత్యేకించి వైసీపీలో కొందరు ముఖ్యనాయకులు అప్పట్లో ఆప్రాంతంలో ముందస్తుగానే భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తాడేపల్లికి సమీపంలో రాజధాని ఏర్పాటు పక్రియ ప్రారంభించింది. అయితే దీన్ని జగన్ వ్యతిరేకించారు. పైగా ఇటీవల ముగిసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అమరావతి విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. దీంతో జగన్ అధికారంలోకి వస్తే రాజధాని ఏర్పాటు విషయంలో మార్పులు చోటు చేసుకోవచ్చన్న అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దొనకొండ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల్లో క్రమేపీ వేగం పుంజుకున్నాయి.
ప్రధానంగా వైసీపీ నాయకులే ఎక్కువగా ఆప్రాంతానికి వచ్చి భూముల కొనుగోలుకు శ్రీకారం పలుకుతున్నారు. జిల్లాలోని ఓ వైసీపీ నేత, పారిశ్రామిక వేత్త ఇటీవల ఒంగోలులో తనకున్న ఒక విలువైన స్థలాన్ని విక్రయించారు. ఆయన కూడా ఆ డబ్బులను వెచ్చించి దొనకొండ సమీపంలో భూముల కొనుగోలుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ పారిశ్రామిక కారిడార్‌కు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. భూముల సేకరణ జరిగింది. కొన్ని పరిశ్రమలు ఏర్పాటుకు సంస్థలు ముందుకు వచ్చినట్లుగా గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఒక మాఫియాగా ఏర్పడి, లేని హడావిడి చేస్తూ దొనకొండలో రియల్ ఎస్టేట్ రేట్లు పెంచేసి హడావిడి చేస్తుంటే, సామాన్య ప్రజలు మాత్రం, 2014లో ఇంతకంటే ఎక్కువే చూసాం అంటూ పెదవి విరుస్తున్నారు.