ముఖ్యమంత్రి ఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే ఆయన తండ్రి స్నేహితుడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. తన స్నేహితుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన మొదటిరోజు నుంచే జగన్ అవినీతి మొదలుపెట్టారని ఆరోపించారు. నేను ఇంకా వైసీపీలోనే ఉన్నానని, వారేమీ నన్ను తీసేయలేదని స్పష్టం చేశారు. వైసీపీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని జోస్యం చెప్పారు. తాను గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని వెల్లడించారు. అది ఏ పార్టీయో మాత్రమో చెప్పలేదు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరని కుండబద్దలు కొట్టారు. పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేమని, రాష్ట్రం కోసం బాబు, పవన్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. జనవరి 3 నుంచి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు తిరగనున్నాయన్నారు. వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించిందని, జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయని, దీనిపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కడప జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. చాలామంది కీలక నేతల మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందన్నారు. వైఎస్ వివేకా కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చని డీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read