రెండు రోజుల క్రితం చంద్రబాబు, ఏమి చెప్పారో అదే జరిగింది. హైకోర్ట్ హడావిడిగా విభజించటం, కేసులు బదిలీ చెయ్యకుండా ప్లాన్ వెయ్యటం, ఇవన్నీ చూస్తుంటే, జగన్ కేసుల విచారణ తిరిగి మొదటికి వస్తుందని, కేసుల విచారణను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు జగన్ తో కలిసి బీజేపీ కుట్ర చేసిందని, చంద్రబాబు చెప్పిందే నిజం అయ్యింది. ఈ రోజు శుక్రవారం జగన్ కోర్ట్ కి వెళ్ళటంతో, అక్కడ విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ కావడంతో.. కొత్త జడ్జీ వచ్చే వరకు దీనిపై విచారణ నిలిచిపోనుంది. జడ్జి వెంకటరమణ రెండేళ్ల పాటు మూడు ఛార్జిషీట్లపై సుమారు 100 గంటలపాటు వాద, ప్రతివాదనలు విన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనతో వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. దీంతో కొత్త జడ్జీ వచ్చాక విచారణ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదని సీనియర్ న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనవరి ఏడు నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో.. సెలవుల అనంతరం వాదనలు ప్రారంభం కానున్నాయి.
జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండున్నరేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి బదిలీతో వాదనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ కేసు మొదటికి వచ్చినట్లయింది. జగన్ ఆస్తుల కేసులో మొత్తం 11 అభియోగపత్రాలను సీబీఐ నమోదు చేసింది. విచారణ ప్రక్రియలో భాగంగా నిందితులుగా ఉన్నటు వంటి జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, మిగతా నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. నేరానికి ఎలాంటి సంబంధం లేకుండానే తమపై అక్రమంగా కేసులు బనాయించారు కాబట్టి ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని పిటిషన్లు వేశారు. వీటిపై గత కొంతకాలంగా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 కేసులకు గానూ 4 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. రెండున్నరేళ్లుగా ఇది కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఏపీకి కేటాయించడంతో బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తి డిశ్చార్జ్ పిటిషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది. ఒక్కో ఛార్జిషీట్లో తీర్పు వెల్లడించినట్లయితే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావించి.. అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్ పిటిషన్లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి. అందుకు మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, జగన్ పై ఉన్న కేసులను అమరావతికి తరలించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులు ఉమ్మడి రాష్ట్రంలో జరగడం, అటాచ్ అయిన జగన్ ఆస్తులు హైదరాబాద్ లోనే ఉండటం కారణంగా విచారణ నాంపల్లిలోని సీబీఐ కోర్టులోనే సాగాల్సివుందని చెబుతున్నారు.