సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, ఆయ‌న పార్టీ వైసీపీని కేసులు చుట్టుముడుతున్నాయి. పాత‌కేసుల‌తోపాటు కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప‌రిపాల‌న వైపు దృష్టి సారించ‌లేక‌, పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్ట‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ కేసులు, వివాదాలు కొన్ని తెచ్చి పెట్టుకున్న‌వి అయితే, మ‌రికొన్ని ప్ర‌భుత్వంలో ఉన్నందువ‌ల్ల ఎదుర్కొంటున్న‌వి. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ల‌క్ష‌ల కోట్లు అక్ర‌మంగా ఆర్జించార‌ని రాజ‌కీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల‌పై న‌మోదైన సీబీఐ, ఈడీ కేసులు ఏళ్లుగా విచార‌ణ సాగుతోంది. అప్ప‌టి కేంద్రంలోకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ఏపీలోని టిడిపితో క‌లిసి ఈ కేసులు బ‌నాయించార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. దాదాపు ప‌దేళ్లుగా సీబీఐ, ఈడీ కేసులు కోర్టుల్లో వివిధ ద‌శ‌ల్లో విచార‌ణ‌కి కూడా ఇంకా రాలేదు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు 2019లో జ‌రిగిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్యపై అప్ప‌ట్లో జ‌గ‌నే సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సీబీఐ ద‌ర్యాప్తు డిమాండ్ నుంచి వెన‌క‌డుగు వేశారు. అయితే వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత కోర్టుల్లో వ్యాజ్యం వేసి సీబీఐ ద‌ర్యాప్తు సాధించారు. సీబీఐ ద‌ర్యాప్తు అటు తిరిగి ఇటు తిరిగి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోద‌రుడైన వైఎస్ అవినాశ్ రెడ్డిని విచార‌ణ‌కు పిల‌వ‌డంతో ఈ కేసు జ‌గ‌న్ మెడ‌కే చుట్టుకుంటోంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 2018లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ హైద‌రాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చి వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్ జ‌నిప‌ల్లి శ్రీనివాస‌రావు సెల్ఫీ తీసుకుంటానని వచ్చి కోడి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే జగన్ భుజానికి గాయమైంది.

jagan sad 02022023 2

అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఉన్న చంద్ర‌బాబుపై త‌మ‌కు న‌మ్మ‌కంలేద‌ని, ఎన్ఐఏ ద‌ర్యాప్తు డిమాండ్ చేశారు. దీనిపై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ కేసు న‌మోదు చేసింది. దీని ద‌ర్యాప్తు నాలుగేళ్ల త‌రువాత ఇప్పుడు విజ‌య‌వాడ ఎన్ఐఏ కోర్టులో ప్రారంభ‌మైంది. ఈ కేసులో బాధితుడైన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోర్టుకి హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మ‌రోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో అది మ‌రో కేసులా వైసీపీ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం ఉంది. నెల్లూరు కోర్టు ప‌త్రాలు మాయం అయిన కేసులో సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించ‌డంతో వైసీపీ కేబినెట్లో మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదీ వైసీపీకి సంబంధంలేని కేసు అయినా మంత్రిపై ఆరోప‌ణ‌లు రావ‌డం చికాకు క‌లిగించేదే. ఢిల్లీ మ‌ద్యం కేసులోనూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి సోద‌రుడు శ‌ర‌త్ చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి సంబంధాలు ఉండ‌డంతో మ‌నీల్యాండ‌రింగ్ కేసులోనూ వైసీపీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. మ‌రోవైపు దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్క‌ర‌ణ కేసులు ఏపీ స‌ర్కారుకి గుదిబండ‌లా త‌యార‌య్యాయి. కేసుల‌తో అధినేత‌, నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతుండ‌డంతో వైసీపీలో ఆందోళ‌న‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read