సిబిఐ అంటే,ఈ దేశంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థ. అలాంటి సిబిఐ ఈ మధ్య కాలంలో అనేక విమర్శలు ఎదుర్కుంటుంది. ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా మరీ వన్ సైడ్ గా, గుడ్డిగా అయితే సిబిఐ వెళ్ళలేదు. ఈ మధ్య కాలంలో ఏపిలోని కేసులు విషయంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఇది ప్రజలకు మాత్రమే కలిగిన అనుమానం కాదు. రెండు రోజుల క్రితం హైకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. జడ్జిల పై వ్యాఖ్యల కేసులో సిబిఐ తీరు అనుమానాస్పదంగా ఉందని, నిందితులకు సహకరిస్తున్నట్టుగా సిబిఐ తీరు ఉంది అంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేయటం, తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇప్పుడు సిబిఐ చేసిన మరో పని కూడా చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (లీగల్ రిటైనర్) గా సిబిఐ పి.సుభాష్ అనే వ్యక్తిని నియమించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ వ్యక్తి జగన్ తరుపున సిబిఐ కేసుల్లో వాదనలు వినిపించిన వ్యక్తి. అంతే కాదు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్లీడర్ కూడా. ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కేసు వాదించకూడదు అనే షరతుతో ఆయన నియామకం జరిగింది. ఇలాంటి వ్యక్తిని సిబిఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అటు జగన్ కు సిబిఐ కేసులు వాదించే లాయరే, ఇప్పుడు సిబిఐ తరుపున వాదించే లాయర్ ఎలా అవుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పై అనేక సిబిఐ కేసులు ఉన్నాయి, అవి తెలంగాణా కోర్టుల్లో ఉన్నాయని సమర్ధించుకున్నా, ఇక్కడ జడ్జిల పై కేసు కానీ, డాక్టర్ సుధాకర్ కేసు కానీ, వివేక కేసు కానీ, ఇలా అనేక కేసులు వైసిపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిబిఐ పని చేస్తుంది. హైకోర్టులో ఈ కేసులు విషయం పై అనేక ప్రత్యుత్తరాలు జరగాల్సి ఉంటుంది. అలాంటి వాటికి, జగన్ కు సన్నిహితంగా ఉండే లాయర్ ని, సిబిఐ ఎలా నియమిస్తుంది, అసలు ఇంకా సిబిఐ ఎందుకు, ఏమి న్యాయం చేస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. సుభాష్ నియమాకం వెనుక, వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తరుపున వాదించే లాయరే సిబిఐ తరుపున ఉంటే, అసలు ఆయనే ఎలా వాదనలు వినిపించగలరు అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి సిబిఐ ఈ తప్పు సరి చేస్తుందో లేదో చూడాలి.