విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. తనపై నెపం మోపడం వల్లే తాను ప్రతిపక్ష నేత జగన్‌ను పరామర్శించడానికి ఫోన్ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కోడి కత్తి దాడితో ఏపీ ప్రభుత్వానికి ఏమిటీ సంబంధమని ప్రశ్నించారు. గవర్నర్ డీజీపీకి ఫోన్ చేస్తారని, బీజేపీ నన్ను ఏ-వన్ అంటుందని ఆరోపించారు. దాడి చేస్తే జగన్‌పై సానుభూతి వస్తుందని భావించానని నిందితుడే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. బై ఎలక్షన్ వచ్చుంటే వైసీపీ ఎంపీ స్థానాలన్నీ టీడీపీ కైవసం చేసుకునేదని జోస్యం చెప్పారు.
అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సభ్యత్వ రుసుంను కార్యకర్తలు తమ జేబు నుంచి చెల్లించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు సభ్యత్వ రుసుం చెల్లించిన 2 నిమిషాల్లోనే తనకు తెలుస్తుందన్నారు. ప్రకృతి సేద్యాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసం చేసింది కనుక మోదీ ఆదుకుంటారని భావించామన్నారు.
కేంద్రంతో విభేదించామని, అందువల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తప్పడు విధానం వల్ల సీబీఐ పరువుపోయిందన్నారు. అవిశ్వాసం పెడితే పార్లమెంట్ సాక్షిగా సన్మానం చేస్తామంటూ మోదీ వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. మరో పక్క, తనపై జరిగిన దాడి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కుట్ర కోణం బయటపడేలా విచారణ జరగడం లేదని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ లో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.