వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలంగాణా ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన నెటిజన్లు మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి అడుగులేస్తున్న జగన్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో 19 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీస సానుభూతి కూడా ప్రకటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఒక సినీ దర్శకుడి విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆగమేఘాలపై ట్వీట్ చేసిన జగన్‌కు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే ధైర్యం లేదా అని తెలంగాణ ప్రాంతానికి చెందిన మెజార్టీ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యమా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే విద్యార్థుల ఆత్మహత్యలు వాస్తవం.
నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు చనిపోయారన్నది వాస్తవం. ఇంటర్ బోర్డ్ ముందు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తే.. వారిని ఈడ్చుకెళ్లి బలవంతంగా అరెస్టులు చేసిన దృశ్యాలు జగన్‌కు కనిపించడం లేదా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు సానుభూతి తెలుపుతూ, ఉగ్రచర్యలను ఖండిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. జగన్ ఈ ట్వీట్ చేయడం హర్షించదగ్గ విషయమే. అదే.. తెలంగాణ విద్యార్థుల విషయంలో జగన్ మానవత్వం ఎందుకు సన్నగిల్లిందనేది ఇక్కడ అసలు ప్రశ్న. రాజకీయ ప్రయోజనాలతో తీసిన రాంగోపాల్ వర్మ సినిమాపై ఉన్న శ్రద్ధ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌పై లేకపోవడం జగన్ బాధ్యతారాహిత్యానికి, టీఆర్‌ఎస్‌తో ఉన్న ఒప్పందానికి నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంలో జగన్‌తో పోల్చుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆత్మహత్యల గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు పలు ట్వీట్స్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్య వార్తలు బాధ కలిగించాయని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ఆయన కొన్ని ట్వీట్స్ చేశారు. స్వయంగా స్పందించకపోయినా.. సోషల్ మీడియా సాక్షిగానైనా జగన్ స్పందించి ఉంటే హుందాగా ఉండేదని, లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసిన రాంగోపాల్ వర్మకు మద్దతుగా ట్వీట్ చేసిన జగన్ కేవలం రాజకీయ ప్రయోజనాలు ఉంటే మాత్రమే స్పందిస్తాననే రీతిలో వ్యవహరించారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్న జగన్‌కు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసిన తప్పేంటని ప్రశ్నించే దమ్ము లేకపోవడం శోచనీయమని విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న నెటిజన్లు నిట్టూరుస్తున్న పరిస్థితి.