లండన్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయని, కేసీఆర్, బీజేపీ మనుషులు జగన్‌తో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, ఇది దుర్మార్గమని, దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాయింట్ 5శాతం కూడా ఓట్లులేని బీజేపీ బహిరంగ సభలు పెట్టి భంగపాటుకు గురికావడం తప్పదని హెచ్చరించారు. శ్రీకాకుళంలో కూడా సభ పెట్టి భంగపడ్డారన్నారు. ఏపీకి మోదీ రూ. 3లక్షల కోట్లు ఇచ్చానని, అమిత్‌షా రూ. 5లక్షల కోట్లు ఇచ్చానని, మరొకరు రూ. 10లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని, దీనిలో ఏది నిజమో వాస్తవాలు చెప్పాలన్నారు.
బహిరంగ సభలు పెట్టి ఏపీకి వచ్చి విషం చిమ్ముతున్నారన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీ చేసిన ద్రోహానికి ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీతో కుమ్మక్కై జగన్ ఆడుతున్న జగన్నాటకానికి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. 2019లో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని పగటికలలు కంటున్నారని, 16 పార్టీలు కలిసి ఎన్డీఏను ఓడించి స్పష్టమైన తీర్పు చెప్పబోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు రౌడీ రాజకీయాలంటూ నిరసనలు తెలపటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, అసలు ఆ పార్టీయే రౌడీయిజం పునాదులపై వచ్చిందని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు. రౌడీ రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని శుక్రవారం ఆమె ఇక్కడ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
తండ్రి మరణానంతరం అధికారం కోసం శవ రాజకీయం చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి అధికారులను బెదిరించి రౌడీల్లా ప్రవర్తించారంటూ విమర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైకాపా ఎమ్మెల్యే రోజా రౌడీ అని సంబోధించడం సిగ్గుచేటని ఖండించారు. వైసీపీ నాయకులు విమర్శించినట్లు చింతమనేని ప్రభాకర్ రౌడీ అయితే ప్రజాక్షేత్రంలో రెండుసార్లు ఎలా గెలిచారో చెప్పాలంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒక్క కేసు కూడా లేదనే విషయాన్ని రోజా తెలుసుకోవాలని అనిత హితవు పలికారు. మరో నేత మాట్లాడుతూ, హవాలా డబ్బులు తరలించేందుకు లండన్‌లో విజయ్‌మాల్యతో జగన్ రహస్య భేటీ అయ్యారని ఆరోపించారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. లండన్ వెళ్ళే ముందు, చెన్నైలోని ఓ హోటల్‌లో పురందేశ్వరి , టీఆర్‌ఎస్ సంతోష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సినీనటుడు మోహన్‌బాబులతో జగన్ రహస్య భేటీ ఎంటో ప్రజలకు తెలిపాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధానాన్ని తరలించుకునేందుకు ప్రధాని మోదీ.. జగన్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే బోండా ఉమా. జగన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.