ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై మంగళవారం ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీవీప్యాట్‌లో గుర్తు కనిపించలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. తన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియదని చంద్రబాబు అంటున్నారని, సినిమాలో విలన్‌లా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఇవే ఈవీఎంలతో 2014లో చంద్రబాబు గెలవలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓడిపోతే ఈవీఎంలపై నెపం నెడుతారని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు.. చంద్రబాబు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజల తీర్పును అవహేళన చేస్తున్నారని జగన్ విమర్శించారు.
వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడెల ఆయన చొక్కాను ఆయనే చించేసుకున్నారని జగన్ విమర్శించారు. గురజాలలో ఓట్లు వేయలేదని ముస్లింలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని జగన్ ఆరోపించారు. పూతలపట్టులో తమ అభ్యర్థి ఎంఎస్ బాబుని కొడితే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఒకే కులానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని విమర్శించారు. నచ్చినవాళ్లకు చంద్రబాబు పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. స్ట్రాంగ్‌రూముల్లోని ఈవీఎంలను బయటికి తెచ్చారని, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూములు తెరవాలన్నారు. స్ట్రాంగ్‌రూముల దగ్గర పారామిలటరీ బలగాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి సీఈవో, సీఈసీ పర్యవేక్షించాలని జగన్ అన్నారు.
‘నా ఓటు ఎవరికి పడిందో నాకే అర్థంకావటం లేదు’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తాను ఫ్యాన్ గుర్తుకు నొక్కితే వీవీప్యాట్‌లో తన ఓటు స్పష్టంగా కనిపించిందని జగన్ తెలిపారు. అదే ‘నా ఓటు సైకిల్‌కు పడుంటే ఊరుకునే వాడిని కాదని’ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 80 శాతం పోలింగ్ జరిగిందన్నారు. ఒకవేళ ఓటు తేడా పడుంటే ఓటర్లే ఫిర్యాదు చేసేవారన్నారు. కానీ ఒక్క ఓటర్ కూడా కంప్లెంట్ చేయలేదన్నారు. చంద్రబాబే ఎందుకు ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటే... ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికేనని విమర్శించారు. ప్రజల గాలి టీడీపీ వైపు లేదనే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.