గత ఏడాది దావోస్ పర్యటన పేరుతో లండన్ దాకా వెళ్లిపోయారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. అప్పట్లో ఈ పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాది కనీసం దావోస్ నుంచి పిలుపు కూడా రాలేదేమో, తాడేపల్లిలోనే ఉండిపోయారు. ప్రపంచ ఆర్ధిక సదస్సుని ప్రతీ ఏటా దావోస్లో నిర్వహిస్తారు. ఈ వేదికపై తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలు, కల్పిస్తున్న ప్రయోజనాలను ఆయా ప్రభుత్వాలు ప్రచారం చేసుకుని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తాయి. టిడిపి హయాంలో దావోస్ కి చంద్రబాబు, లోకేష్ వెళితే విమర్శలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్ అండ్ బ్యాచ్, ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత దావోస్ వెళ్లారు. వచ్చిన పెట్టుబడులు లేవు. ప్రభుత్వం సొమ్ముతో జగన్ ప్రత్యేక విమానంలో వెళ్లి తన కుమార్తెలను కలవడంతో పాటు న్యాయస్థానాలను దూషించిన కేసులో సీబీఐ వెతుకుతున్న పంచ్ ప్రభాకర్ తో భేటీ అయ్యారు. ఏపీ బృందం గత దావోస్ పర్యటన ఖర్చు కొండంత, రాష్ట్రానికి ఒనగూడిన ప్రయోజనం గోరంత కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది 16వ తేదీనే ప్రారంభమైన దావోస్ సదస్సుకి తెలంగాణ ఐటీ మంత్రి, అధికారుల బృందం హాజరైంది. ప్రతీ ఏటా దావోస్ వెళ్లే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 30,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.
అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇలా అనేక రాష్ట్రాల ప్రతినిధి బృందం దావోస్ వెళ్ళింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ న్యూడిల్స్ బండి ప్రారంభోత్సవంలో బిజీగా వున్నారు. ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న వైసీపీ సర్కారు, పారిశ్రామికవేత్తల బెదిరించడం, ప్రపంచప్రఖ్యాత సంస్థలైన జాకీ, లులూ వంటివి పాలకులే తరిమేయడంతో అంతర్జాతీయంగా కూడా ఏపీ పరువు పోయింది. దావోస్ నుంచి పిలుపు రాలేదు. ఒక వేళ పిలుపు వచ్చినా సీబీఐ, ఈడీ కేసుల విచారణకి తోడు ఎన్ఐఏ కేసు విచారణకీ సాక్షిగా జగన్ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ జాతీయ సంస్థలు విచారణలో ఉన్న జగన్ దావోస్ వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలి. ఇది మరోసారి చర్చనీయాంశమై తనకు డ్యామేజీ అవుతుందని ఆగిపోయారని జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే అసలు దావోస్ నుంచి ఈ సారి పిలుపు కూడా రాలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. గత ఏడాది దావోస్ లో జగన్ బ్యాచ్ నిర్వాకం మొత్తం, అక్కడ నిర్వాహకులు చూసి, ఈ సారి పిలవలేదేమో అని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దావోస్ పర్యటన పై వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి వివరణ అయితే రాలేదు.