ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏమవుతుంది ? అమరావతి ఇలాగే కొనసాగుతుందా, లేక అమరావతిని మార్చేస్తారా ? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో, రాష్ట్ర ప్రజలను వేధిస్తున్నాయి. ఒక్కో మంత్రి, ఒక్కోలా మాట్లాడుతూ, అమరావతి పై గత ఆరు నెలలుగా గందరగోళ పరిస్థితులకు దారి తీసారు. అందరి కంటే ముందు మంత్రి బొత్సా మాత్రం, అమరావతి ఇక్కడ ఉండదు అనే విధంగా ప్రకటనలు చేసారు. మరో పక్క 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి అయితే, మరింత బాధ. వీరు డిసెంబర్ 9 నుంచి ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు. మరో పక్క అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేసి, దానికి రూపు ఇచ్చి, రైతులను ఒప్పించి భూములు తీసుకుని, నిర్మాణం మొదలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, అమరావతి పై, రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఇలా కొనసాగుతూ ఉండగానే, ఇండియా మ్యాప్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీసేయటం మరింత ఆందోళనకు కలిగించింది.

amaravati 26112019 2

దీని పై తెలుగుదేశం పార్టీ, పార్లిమెంట్ లో పోరాడి, కేంద్రాన్ని మళ్ళీ అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చూపిస్తూ, కొత్త మ్యాప్ రిలీజ్ అయ్యేలా చేసారు. గత ఆరు నెలలుగా, అమరావతి పై ఇంత గందరగోళ పరిస్థితి ఉంటే, ప్రభుత్వ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం, అమరావతి మీద ఒక్క మాట అంటే, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమరావతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికీ పోదు అంటూ భరోసా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ మ్యాప్ రిలీజ్ చెయ్యటం, పార్లిమెంట్ లో అడిగే ప్రశ్నలకు జవాబు ఇస్తూ, కేంద్ర మంత్రులు కూడా, ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి అంటూ పదే పదే సంబోధిస్తూ ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇక అమరావతిని గుర్తించవలసిన పరిస్థితి వచ్చింది.

amaravati 26112019 3

నిన్న అమరావతి పై రివ్యూ చేసిన జగన్ మోహన్ రెడ్డి, మొదటిసారి అమరావతి పై పాజిటివ్ న్యూస్ వినిపించారు. అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఎక్కువ ఖర్చుకు వెళ్ళకుండా, అవసరం ఉన్న మేర నిర్మాణాలు పూర్తీ చెయ్యాలని ఆదేశించారు. అలాగే రైతుల ఫ్లాట్లను కూడా అభివృద్ధి చెయ్యమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే నిర్మాణాలు సగంలో ఉండతతో, ఆ నిర్మాణాలు పూర్తీ చెయ్యాలని కోరారు. హ్యాపీ నెస్ట్ పై కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్ళమని కోరారు. అయితే ఎట్టకేలకు జగన్ మోహన్ రెడ్డి, అమరావతి పై ఒక సానుకూల నిర్ణయం తీసుకోవటంతో, ఇకనైనా అమరావతి ముందుకు సాగుతుందా, లేదో చూడాలి. అయితే సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ, వివిధ విభాగాలు ఇక్కడే ఉండాలా లేదా అనేది, కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read