పులివెందుల పులి, జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా ఎన్నికల పై తన నిర్ణయం ప్రకటించాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటూ, ఇంత బిజీ పాదయాత్రలో కూడా వారనికి రెండు రోజులు, తెలంగాణాలోనే ఉండే జగన్ బాబు, తెలంగాణా ఎన్నికల్లో వీరోచితంగా కేసీఆర్ తో పోరాటం చేస్తారని, ఆయన అనుచరులు చెప్తూ వచ్చారు. మా వాడు పులివెందుల పులి, ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ కు చుక్కలు చూపిస్తారని చెప్పారు. కాని, పాపం పులివెందుల పులి, 2024 దాకా తెలంగాణాలో రెస్ట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తుంటే, జగన్, పవన్ మాత్రం, గత రెండు నెలలుగా, అదిగో ఇదిగో అంటూ, కాలయాపన చేసారు. చివరకు జగన్ నిన్న తన నిర్ణయం ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని, ఈ ఎలక్షన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని నిన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించింది. ‘తెలంగాణలో గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించాం’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి వైసీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. తర్వాత వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ ఏనాడు, కేసీఆర్ ను ఒక్క మాట కూడా జగన్ అనలేదు.
ఇక మరో పోరాట యోధుడు, ఈ ప్రపంచంలో చేగోవీరా తరువాత, నేనే అని, ఈ దేశంలో అందరినీ, నేనే గెలిపించాను అని వీరిచోతింగా డైలాగులు చెప్పే పవర్ స్టార్, ఎలాంటి పవర్ ఫుల్ నిర్ణయం తీసుకుంటారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జన సైనికులు మాత్రం, మా అన్న తెలంగాణాలో పోటీ చేస్తే, కేసీఆర్ అడ్రస్ గల్లంతు అవుతుందని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి పవర్ ఫుల్ నిర్ణయం తీసుకొంటారో చూడాల్సి ఉంది. ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీళ్ళ కోసం, విభజన హామీలు అమలు కోసం, ఉమ్మడి ఆస్తుల విభజన కోసం, 5 వేల కోట్ల కరెంటు బాకయుల కోసం ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ అంటే, జగన్, పవన్ కి ఎందుకో అంత లవ్వు. ఇక్కడకు వచ్చి మాత్రం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దరించేది మేమే అంటూ డైలాగులు చెప్తున్నారు. అయినా, వీళ్ళు నిర్ణయం తీసుకునేది ఏముందిలే, ఢిల్లీ నుంచి అమిత్ షా, ఏమి చెప్పమంటే అది చెప్పాలి కదా...