జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులు పాటు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యారు. నిన్న మధ్యానం ఢిల్లీ చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి, కొంత మంది కేంద్ర మంత్రులను కలిసారు. ముఖ్యంగా న్యాయ శాఖా మంత్రి, పెట్రోలియం మంత్రి, జల శక్తి మంత్రి, హోం మంత్రి, ఇలా మొత్తం ఆరుగురిని కలిసారు. అయితే ఆయన ఆర్ధిక మంత్రి, రక్షణ మంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేయగా, వారి అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. అయితే ఇది ఇలా ఉంటే, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వివిధ కేంద్ర మంత్రులను కలిసి, వారిని ఏమి అడిగారో, ఆ లిస్టు బయటకు వచ్చింది. అయితే ఆ లిస్టు చూస్తే మాత్రం, కొంచెం తేడాగా ఉంది. ఏది నిజం, ఏది అబద్ధం అనేది అర్ధం కావటం లేదు. కేంద్ర మంత్రులు అబద్ధం చెప్తున్నారో, మీడియాలో జగన్ మోహన్ రెడ్డి ఇవి అడిగారు అంటూ వస్తున్న విషయాలు అబద్ధమో అర్ధం కావటం లేదు. యధావిధిగా ప్రత్యెక హోదా నుంచి విభజన హామీలు దాకా అన్నీ కేంద్రాన్ని అడిగేసారని వార్తలు వచ్చాయి. మరి మెడలు వంచారా ? రాష్ట్రానికి ఏమైనా వస్తుందా అనే దాని పై మాత్రం, ఎక్కడా స్పష్టత లేదు. ఇది ఇలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి అడిగారు అంటూ చెప్పిన మూడు అంశాలు మాత్రం, ప్రజలను కన్ఫ్యూషన్ లో పడేస్తున్నాయి.
ముందుగా జగన్ మోహన్ రెడ్డి పోలవరం గురించి, జలశక్తి మంత్రిని అడిగారని, అంచనాలు ఆమోదం గురించి త్వరగా తెల్చమన్నారని, అలాగే ప్రభుత్వానికి రావాల్సిన రీయింబర్స్మెంట్ గురించి అడిగారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తీరా చూస్తే జలశక్తి మంత్రి మాత్రం, ట్వీట్ చేస్తూ అసలు పోలవరం విషయమే రాయలేదు. జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారని, ఇంటింటికీ తాగునీరు ప్రాజెక్ట్ పై చర్చించామని అన్నారు. ఇక మరో మంత్రిని కలసిన సందర్భంలో హైకోర్టు త్వరగా షిఫ్ట్ చేయమని అడిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా, హైకోర్టు మార్పుకి , మాకు సంబంధం లేదని, అది హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీం కోర్టుతో తేల్చుకోవాలని ఇప్పటికే చెప్పింది. ఇక మరో అంశం మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని జగన్ కరినట్టు వార్తలు వచ్చాయి. అంటే ఇప్పటి వరకు వాటికీ అనుమతులు లేకుండానే, ఫుల్ పేజి ఆడ్స్ ఇచ్చి, మీడియాలో ప్రచారం చేసుకున్నారా ? ఇలా అనేక అంశాల్లో, ప్రజలకు కన్ఫ్యూషన్ ఉంది. ఏపి ప్రభుత్వం వైపు నుంచి అసలు దేని మీద చర్చించారు అనేది మాత్రం, ఇప్పటి వరకు ప్రెస్ నోట్ రాలేదు.