వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సుమారు రెండు గంటలపాటు జరిగిన వైసీపీఎల్పీ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రారంభమై 12 గంటలకు సమావేశం ముగిసింది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక ప్రకటనలు.. ముఖ్యంగా ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా.. ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు జగన్ తేల్చిచెప్పారు. అంతేకాదు పార్టీలో తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎవరూ అసంతృప్తికి లోనుకాకుండా ఉండేందుకు గాను.. రెండున్నరేళ్ల తర్వాత 90శాతం మంత్రులను మారుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు.
ఇప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి అప్పుడు కేటాయిస్తామని జగన్ చెప్పకనే చెప్పేశారన్న మాట. అయితే వీరిలో కొత్తవారు కూడా ఉంటారని జగన్ ప్రకటించేశారు. కాగా.. శనివారం ఈ 20 మంది మంత్రులతో పాటు.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఏర్పాటు విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించనున్నట్లు జగన్ స్పష్టం చేశారు. ఈ ఐదుగురు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉంటారని కూడా జగన్ ప్రకటించడంతో వాళ్లెవరనే చర్చ జోరందుకుంది. అయితే.. ప్రస్తుతం మీడియా వర్గాల్లో ఐదుగురి పేర్లు తెరపైకొచ్చాయి.
కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి అవకాశం కల్పించి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక మైనార్టీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ కేటగిరిలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు, ఎస్టీ నుంచి విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు, బీసీ సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి గెలుపొందిన కొలుసు పార్థసారధికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం దక్కి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క, సియం కార్యాలయం నుంచి మొదటి ఫోన్ వెళ్ళింది. సీఎం పేషీ నుంచి కొరముట్ల శ్రీనివాసులుకు విజ యవాడ రావాలని ఆహ్వానం అందడంతో రైల్వేకోడూరు వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున బాణా సంచాకాల్చి స్వీట్లు పంచుకున్న నేతలు, కార్యకర్తలు.