కేసీఆర్, దొంగ కంపెనీల సృష్టికర్త జగన్ ఏకమై ఆంధ్రప్రదేశ్‌పై హైదరాబాద్‌లో కుట్రలు చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ విమర్శించారు. 26ప్రశ్నలతో ఆదివారం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులపై జగన్ సలహాలతో కేసులు వేసిన కేసీఆర్ ఏపీపై కక్ష గట్టారని మండిపడ్డారు. ‘మిత్రులను బట్టి గుణం తెలిసిపోతుంది. 12 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్‌తో కలిసి మీరు నవ్యాంధ్రపై చిమ్ముతున్న విషం ప్రజలకు అర్థమైంది’ అని పేర్కొన్నారు. ‘నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గురుకుల ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ నిర్మాణాలను తొలగించిన మీరు లోటస్ పాండ్‌లో జగన్ భవంతి, జగన్ పత్రిక కార్యాలయం ఎందుకు తొలగించలేదు. జగన్ ఇంద్ర భవనంలో అక్రమాలను సీబీఐ, టౌన్ ప్లానింగ్ నిర్ధారించినా ఎందుకు చర్యల్లేవో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
కుట్రలను తిప్పికొట్టి జగన్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం తథ్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో దేశ ప్రధానిని నిర్ణయించేది ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో అన్నారు. రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ సీఎం కే.చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కె.తారక రామారావుల పెత్తనమేంటని నిలదీశారు. కేసీఆర్ ఫాంహౌ్‌సలో కూర్చొని వైసీపీ తరఫున ఏపీ లోక్‌సభ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. బ్రీఫ్‌కేసు కంపెనీలు సృష్టించిన రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి భాగోతం బయటపెట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. బ్రీఫ్ కేసు కంపెనీల ద్వారా హవాలా మార్గంలో రాష్ట్రానికి డబ్బు తరలించడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.
జగన్ లండన్ వెళితే తప్పేంటని, హవాలా డబ్బు తెచ్చుకుంటే తప్పేంటని బీజేపీ అద్దె మైకు జీవీఎల్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ, అమిత్ షా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని నిలదీశారు. మోదీ, కేసీఆర్, జగన్ కలసి ఆడుతున్న నాటకాలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ చక్రవర్తి, యువరాజు కేటీఆర్ ద్వారా సామంత రాజుగా జగన్‌ని ప్రకటించి ఏపీ ప్రజలపై పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ, టీఆర్‌ఎ్‌సలకు కంబైన్డ్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ జ్యోతిష్యం తెలంగాణలో పనిచేసినట్లుగా ఆంధ్రాలో పనిచేయదని మంత్రి కేఎస్ జవహర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని టీఆర్‌ఎస్ నాయకులకు ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ లండన్ టూర్‌కు వెళ్లేటప్పుడు ఏపీ వైసీపీ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే మేలని సూచించారు.