తనను దున్న అన్నవాడు దున్నపోతని మన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు. గురువారం మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం అసెంబ్లీకి రాదని, పార్లమెంట్‌లో ఉండదని విమర్శించారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తున్నారని, ఇలాంటి ప్రతిపక్షం మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పెన్షన్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కడుపు మండుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు రాకుండా చూసే బాధ్యత చెల్లెమ్మలదేనని చంద్రబాబు అన్నారు. మహిళలకు అన్నగా అండగా ఉంటానని, పసుపు-కుంకుమ కింద డబ్బులు ఇచ్చానని చంద్రబాబు అన్నారు.
అన్నగా అండగా ఉండాలని, మనది రక్త సంబంధం కాకపోయినా పూర్వ జన్మ అనుబంధమని అన్నారు. అందుకే చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ. 20వేలు రెండు విడతలుగా పసుపు-కుంకుమ కింద ఇచ్చానని చెప్పారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణ విముక్తి చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పనితీరును ఆయన ప్రశంసించారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. రాష్ట్రాంలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తయారు చేశామని, అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే దొంగ జగన్ అని చంద్రబాబు అన్నారు.
కోడి కత్తితో వైసీపీ రాజకీయ డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. తనది ఉడుం పట్టని, మోదీని గద్దె దించేవరకు వదలనన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాశం నుంచి ఊడిపడినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు అన్నారు. ‘బిడ్డ గర్భంలో పడినప్పటినుంచి పుట్టుక, బాల్యం, చదువు, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పెళ్లి కానుక, పింఛను, చంద్రన్నబీమా వరకు సాయం చేశాం. ఒకవేళ చనిపోతే గౌరవంగా అంతిమయాత్ర చేసేందుకు మహాప్రస్థానం పెట్టాం. సవాల్ చేస్తున్నా.. ఇంత సంక్షేమం చేసిన రాష్ట్రం దేశంలోనే లేదు. చివరకు సంపన్న రాష్ట్రాలు కూడా ఇంత సంక్షేమం చేయలేదు. ఎక్కడైనా ఉంటే చెప్పండి. వారు చెప్పేదీ వింటా’ అని తెలిపారు. తమది మానవత్వం ఉన్న ప్రభుత్వమని, కేంద్రానికి మానవత్వం లేదని విమర్శించారు.