వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి శీతల ప్రదేశాలకు వెళ్తుంటారు. మన దేశంలో అయితే కొందరు కశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ ఇలా ఎవరి బడ్జెట్‌కు తగినట్లు వారు తమ ప్లాన్‌ను సిద్ధం చేసుకుని వెళ్తుంటారు. వారికి నచ్చిన ప్రదేశాల్లో కుటుంబసభ్యులలో కలిసి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో నిత్యం ప్రత్యుర్థులపై విరుకుపడే రాజకీయ నేతలు కూడా కాస్త చల్లబడడం కోసం శీతల ప్రదేశాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్ కూడా వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్తున్నారు. అత్యంత శీతల ప్రాంతమైన స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.
కాసేపట్లో హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరనున్నారు. కుటుంబసభ్యులు సహా ఆయన విదేశి పర్యటనకు వెళ్తున్నారు. ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జగన్ విడిది చేయనున్నారు. ఈనెల 27 రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. గత సంవత్సరం వేసవిలో కుటుంబసభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లారు. న్యూజిలాండ్‌లో ఆయన బంగీజంప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పర్యటనకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడానికి ఆయన సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.