కాపు రిజర్వేషన్ల విషయం పై జగన్ ఎన్ని మాటలు మరుస్తున్నాడో చూస్తున్నాం. ఒక రోజు అది కేంద్ర పరిధిలోని అంశం, నాకు సంబంధం లేదు అన్నాడు. మరో రోజు, నా మాటలు వక్రీకరించారు, నేను రిజర్వేషన్ ఇస్తాను అంటూ, కాపులని అన్ని విధాలుగా జగన్ మభ్యపెడుతున్నారు. పాదయాత్రలో కూడా జగన్ కు నిరసనలు తగులుతూనే ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జగన్ కు ఇబ్బంది అవుతున్న వేళ, అనుకోని వ్యక్తి వచ్చి జగన్ కు మద్దతు ఇచ్చాడు. జగన్ చెప్పింది చాలా కరెక్ట్ అని, జగన్ మాట మార్చటం తప్పేమీ కాదని, ఆ వ్యక్తి చెప్పారు. అనుకోని వ్యక్తి అని ఎందుకు అంటున్నాం అంటే, ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేదు. తెలంగాణ వ్యక్తి. అతనే మోత్కుపల్లి నరసింహులు. మొన్నీ మధ్య ఆపరేషన్ గరుడ టీంలో చేరారు.
కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. కాపులను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొని చంద్రబాబునాయుడు వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోకూడదని ఆయన సూచించారు. ఇద్దరూ కలిసి కట్టుగా, చంద్రబాబు పై పోరాడాలని, మా లాంటి వారి సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు. అందరి లక్ష్యం చంద్రబాబుని దించటమే కావాలని అన్నారు.
తన లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తాను ఏ పార్టీలో చేరబోనని ఆయన చెప్పారు. ఎస్సీ వర్గీకరణను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. కాపులను తన స్వార్థానికి ఉపయోగించుకొని వదిలేశాడని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.ఈ విషయంలో బాబు వైఖరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కాపులకు హితవు పలికారు. రెండు రోజుల క్రితం మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. జనసేన చీఫ్ ను కలుస్తారని కూడ ప్రచారం సాగింది. అయితే పవన్ కళ్యాణ్ ను ఆయన కలువలేదు.