ఏ ప్రభుత్వం అయినా, ప్రజల కోసం పని చేయాలి. అంతే కాని, ఎదుటి వ్యక్తి మీద కక్షతో కాదు. మన రాష్ట్రంలో ఇది మరీ ఎక్కువ. చంద్రబాబు మొదలు పెట్టారని అమరావతి ఆపారు, చంద్రబాబు తెచ్చారని కొన్ని కంపెనీల గురించి పట్టించుకోవటం మానేశారు. ఇలాగే రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఆలోచిస్తే, చంద్రబాబు మొదలు పెట్టిన హైదరాబాద్ అభివృద్ధి, ఇంత పెద్ద ఎత్తున జరిగేదా ? వాళ్ళు అక్కడ చంద్రబాబుని చూడలేదు, అందులో రాష్ట్రానికి అవకశాలు చూసారు, ఉపాధి అవకాశాలు చూసారు, అందుకే చంద్రబాబు మొదలు పెట్టినా, వీరు ముందుకు తీసుకు వెళ్లి సక్సెస్ అయ్యారు, ఇప్పటికీ అవుతూనే ఉన్నారు. అదే అమరావతిని ఈ రోజు కంటిన్యూ చేసి ఉంటే, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మరో రకంగా ఉండేవి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఫోర్చ్యున్ 500 కంపెనీ, విశాఖలో పెట్టుబడి పెట్టకుండా వెళ్ళిపోయింది. అంతే కాదు ఆ సమయంలో వైసీపీ నేతలు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక డమ్మీ కంపెనీకి చంద్రబాబు 40 ఎకరాలు ఇచ్చారని, పార్లమెంట్ వేదికగా వైసీపీ నేతలు చేసిన ప్రకటనతో, రాష్ట్ర పరువు పోయింది. వీళ్ళకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే ఒక డమ్మీ కంపెనీనా అందరూ నవ్వుకున్నారు.
నిజంగా చంద్రబాబు ప్రభుత్వం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు భూమి విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే., చర్యలు తీసుకోవాలి. అంతే కానీ, ఒక ఫోర్చ్యున్ 500 కంపెనీని, చంద్రబాబు మీద కోపంతో డమ్మీ కంపెనీ అని, ఒక దేశ పార్లమెంట్ లో అంటే, ఎవరికి నష్టం ? దీంతో అప్పట్లో ఆ కంపెనీ , విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టకుండా వెనక్కు వెళ్ళింది. విశాఖ యువతకు అవకాశాలు వచ్చే ఒక మంచి మార్గం మూసుకుపోయింది. హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ ఎలాగో, విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వస్తే, అవకాశాలు వస్తూ, ఒక ఎకో సిస్టం తయారు అవుతుందని చంద్రబాబు భావించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మూర్ఖంగా చంద్రబాబు ఇచ్చిన భూమి రద్దు చేసింది. డమ్మీ కంపెనీ అంటూ హేళన చేసారు. అయితే ఇప్పుడు తప్పు తెలుసుకున్నారో, లేక ఏమి అయ్యిందో కానీ, ఇప్పుడు మళ్ళీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు ప్రభుత్వం లేఖ రాసింది. మీకు 25 ఎకరాలు ఇస్తాం, వచ్చి పెట్టుబడి పెట్టండి అంటూ, ఆ కంపెనీకి లేఖ రాసారు. దీని పై స్పందించిన తెలుగుదేశం పార్టీ, అందుకే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, తుగ్లక్ ప్రభుత్వం అని విమర్శ చేసేది అంటూ కౌంటర్ ఇచ్చారు.