ఉద్యోగుల పీఆర్సీ జీవో పై ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పీఆర్సీ ఫిట్మెంట్ తగ్గించటం, అదే విధంగా hraలో కోత విధించటం పై, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలక్టరేట్లను ముట్టడించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరసనలతో అట్టుడుకి పోయింది. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పై, తమకు న్యాయం చేయాలి అంటూ, హైకోర్టులో ఏపి గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య పిటీషన్ దాఖలు చేసారు. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించటం పై, ఈ పిటీషన్ లో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. విభజన చట్టం ప్రకారం, ఎలాంటి బెనిఫిట్స్ కూడా తగ్గించకూడదని పిటీషన్ లో పేర్కొన్నారని, ఏపి విభజన చట్టంలోని సెక్షన్ 78 కు విరుద్ధంగా ఉన్న ఈ జీవో నెంబర్ వన్ ని రద్దు చేయాలని చెప్పి కూడా , ఆయన పిటీషన్ లో కోరారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని, ఆయన రాష్ట్ర హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా జీవో నెంబర్ వన్ లో, పీఆర్సీకి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం మొన్న జీవో విడుదల చేసింది. మొన్న అర్ధరాత్రి విడుదల చేసిన ఈ జీవో, విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ పిటీషన్ లో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోని వెంటనే రద్దు చేసి, ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి, ఆ పిటీషన్ లో ఆయన హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసారు. పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం, పిటీషన్ ను రేపు విచారణ చేస్తామని, పితీషన్ ను రేపటికి వాయిదా వేసింది. రేపు ఈ విషయం పై వాదనలు జరగనున్నాయి. మరో పక్క సచివాలయంలో రెండు ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యాయి. సచివాలయంలో వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ సమావేశం అయ్యారు. పీఆర్సీ కోసం ఉమ్మడి ఉద్యమంపై ఇప్పటికే ఐకాసలతో సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. షజాలకు తావులేదని, అందరం, అన్ని సంఘాలు కలిసి పోరాడేది ఉద్యోగుల కోసమే అని అంటున్నారు. ఎన్జీవోలు,రెవెన్యూ సంఘాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయని, రేపటిలోగా ఐక్య వేదికకు ఒక రూపం వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పష్టం చేసారు. ఈ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.