విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి చేసి, జగన్ బుజం పై గుచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైజాగ్ లో ఫస్ట్ ఎయిడ్ చేసి, అంతా బాగానే ఉందని, జగన్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటికి కూడా వెళ్ళిపోయారు. అయితే, ఏమైందో ఏమో, మళ్ళీ జగన్ హైదరాబాద్‌లో సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన భుజంపై కత్తి గాయమైందని, ప్రాథమికంగా శస్త్రచికిత్స చేసినట్టు వెల్లడించారు. గాయం 3 నుంచి 4 సెం.మీల లోతులో కండరానికి దెబ్బ తగిలిందని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ హెల్త్ బులెటిన్‌ను డాక్టర్లు గురువారం సాయంత్రం విడుదల చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం శాంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వచ్చారని, దాడి చేయడంతో భుజం కండరానికి గాయం అయ్యిందని చెప్పారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, 9 కుట్లు పడ్డాయని డాక్టర్లు తెలిపారు. జగన్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. జగన్ ఇవాళ హాస్పిటల్‌లోనే ఉంటారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. కత్తికేమైనా విషపూరితమైన పదార్థం ఉందా అనే అనుమానంతో నమూనాలను పరీక్షలకు పంపామని తెలిపారు. జగన్‌కు తొమ్మిది కుట్లు వేశామని, ఆయన ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. వైద్య నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి జగన్ ధైర్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడిని ఖండిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కానీ ఘటనను రాజకీయంగా పులిమి లబ్ధి పొందాలనుకుంటే ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. "దాడి చేసిన మనిషి దొరకకపోతే విమర్శించొచ్చు. ఆ వ్యక్తి వైసీపీ అభిమాని అని చెబుతున్నా టీడీపీని విమర్శిస్తున్నారు. మీ విమర్శలను స్వీకరిస్తాం.. కానీ దాడి చేసిన వ్యక్తి మాత్రం వెనకేసుకురాం. మీ అభిమాని మిమ్మల్ని ఎందుకు పొడిచాడో తెలియదు. ఆ విషయం దర్యాప్తులో తేలుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని వైసీపీ, జనసేన, బీజేపీ, టీఆర్ఎస్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి’’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.