కోడి కత్తి గుచ్చుడు దాడిలో, చిన్న గాయం అయ్యి, హైదరాబాద్ లోటస్ పాండ్ లో రెస్ట్ తీసుకుంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ గాయాన్ని వైద్యులు ఈరోజు పరిశీలించారు. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి ఆరువారాల సమయం పడుతుందని చెప్పారు. లోటస్ పాండ్‌లో ఆయన్ను పరిశీలించిన అనంతరం సిటీ న్యూరో సెంటర్ డాక్టర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. కోడికత్తితో చేసిన గాయంపై రక్త నమూనాల నివేదిక వచ్చిందని, అందులో ఎలాంటి విష నమూనాలు లేనట్లు గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలియటంతో, వైసీపీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇన్నాళ్ళు అది విషం పూసిన కోడి కత్తి ఏమో అని, జగన్ అన్నకు స్లో పాయిజన్ ఎక్కుతుంది ఏమో అని, ఖంగారు పడిన వైసీపీ అభిమానులు, ఈ వార్తా విని, మా అన్న ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని సంతోషం వ్యక్తం చేసారు. మరో పక్క, పాదయాత్రకు వెళ్లాలనే అభిప్రాయంలోనే జగన్ ఉన్నారని, అయితే కొన్ని జాగ్రత్తలతో కొనసాగించవచ్చని తాము చెప్పినట్లు డాక్టర్ శివారెడ్డి వివరించారు. చేతిని కదిలించేటప్పుడు జగన్ నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. నొప్పి ఇంకా తగ్గకపోవడంతో జగన్ కు యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.
త్వరలోనే మళ్లీ ఆయన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో చేతికి ఎక్కువ శ్రమ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. చర్మంపై వేసిన కుట్లు సాధారణంగా వారంలోనే మానిపోతాయనీ, అయితే కండరాలకు వేసిన కుట్లు మానడానికి మరికొంత సమయం పడుతున్నారు. జగన్ విషయంలో గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పట్టే అవకాశముందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వెళతానన్న కోణంలోనే జగన్ మాట్లాడారని తెలిపారు. కాని మేము మాత్రం, గాయం మానే దాక, 45 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తున్నామని అన్నారు.